నిజామాబాద్ రూరల్/జక్రాన్‌పల్లి/డిచ్పల్లి/ధర్పల్లి, ఆగస్టు 9 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్సీకి వినతిపత్రాలు అందజేశారు. జక్రాన్‌పల్లి జడ్పీటీసీ పాట్కూరి తనూజ మామ, మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డి తండ్రి తుక్కన్న అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. తుక్కన్న చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించారు. ఆమెవెంట రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జక్రాన్‌పల్లి ఎంపీపీ డీకొండ హరిత, వైస్ ఎంపీపీ కుంచాల విమలారాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, ప్రవాస భారతీయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
నగర శివారులోని గంగస్థాన్ ఫేస్-2లో పట్టణ ప్రకృతి వనం పనలకు ఎమ్మెల్సీ భూమిపూజ చేశారు. కాలనీలో సుమారు 400 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు కాలనీ కమిటీ అధ్యక్షుడు నర్సింగ్‌రావు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. తమ డివిజన్ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒకటో డివిజన్ కార్పొరేటర్ కోర్వ లలిత ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఖిల్లా డిచ్పల్లి రామాలయ కమిటీ చైర్మన్ పొద్దుటూరి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీని కలిసినవారిలో విండో చైర్మన్ గజవాడ జైపాల్, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ధర్పల్లి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కలిశారు. అభివృద్ధి నిధులపై చర్చించారు. ఎమ్మెల్సీని కలిసినవారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.