నిజామాబాద్, ఆగస్టు 24:(నమస్తే తెలంగాణ ప్రతినిధి):సామాన్య ప్రజానీకానికి వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారంగా మారా యి. ఊహించని విధంగా కరోనా కష్టకాలంలో కేంద్రం ఎడాపెడా ఇంధన ధరలు పెంచుతున్నది. మరోవైపు వంట గ్యాస్ ధరలను సైతం అమాం తం ఎగబాకిస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నది. గడిచిన ఏడాది కాలంలో ఎల్పీజీ సిలిండర్‌పై వినియోగదారులకు వ చ్చే రాయితీని భారీ గా ఎత్తి వేశారు. అదే సమయంలో ధరను రూ.వెయ్యికి చే రువ చేశారు. పెట్రో ల్, డీజిల్ ధరలను సైతం రూ.100 దాటించి దేశ చరిత్రలో నరేంద్రమోడీ ప్రభుత్వం చీకటి అధ్యాయానికి నాంది పలికింది. మోయలేని భారంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరోమారు వంట గ్యాస్ ధరను పెంచడంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై జ నాలు మండిపడుతున్నారు. కరోనా వైరస్ మూలంగా వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్న సందర్భంలో దేశ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర మే అడ్డదిడ్డంగా ధరలను పెంచడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా నిత్యావసరాలు, కూరగాయలపైనా ప్రభావం చూపుతోంది. సిలిండర్ ధర ఆకాశాన్ని తాకడంతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలోనే వంట గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.3 30 పెంచడం భయాందోళనకు గురి చేస్తోంది.
ఎట్లెట్లా పెంచారంటే..
2020 మార్చిలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.880.50 ఉండగా దీనిపై వినియోగదారుడికి రాయితీ రూపంలో రూ.348.14 వచ్చేది. ఇదే సంవత్సరం మే నెలలో కేంద్ర ప్రభుత్వం రోజుకింత రాయితీలో కోత విధిస్తూ వచ్చింది. ఫలితంగా ఎల్పీజీ సిలిండర్‌పై వచ్చే రాయితీ ఇప్పుడు రూ.45.88కి చేరింది. రాయితీని భారీగా ఎత్తివేస్తూనే మరోవైపు సిలిండర్ ధరను అమాంతం పెంచుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నది. 2020 డిసెంబర్ నాటికి రూ.602.50 ఉన్న సిలిండర్ ధరను రూ.715కు తీసుకువచ్చారు. అనంతరం 2021 జనవరిలో రూ.765లకు ఎల్పీజీ ధరను పెంచారు. రాయితీని రూ.46.88 కుదించారు. ఫిబ్రవరి 15 నాటికి రూ.840కు చేరిన గ్యాస్ ధర నెల వారీగా పెరుగుతూ ప్రస్తుతం రూ.935.50కు చేరింది. దీనిపై రాయితీని మాత్రం రూ.40.71కి తీసుకువచ్చారు. కరోనా వైరస్ మూలంగా ఏడాదిన్నర కాలంగా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో నెట్టివేయబడ్డారు. సామాన్య ప్రజల జీవితాలు గందరగోళంలో పడ్డాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మేమున్నామంటూ ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా వంట గ్యాస్ ధరలను ఎడాపెడా బాదుతూ పోతున్నది. వీటికి తోడుగా పెట్రోల్, డీజిల్ ధరలను సైతం రికార్డు స్థాయికి తీసుకువచ్చింది. వాహనం తీయాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట గ్యాస్ ధరలతోనూ తలలు పట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
సామాన్యుల విలవిల
నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు పేదలకు మోయలేని భారాన్ని మోపుతున్నది. ఓ వైపు ఇంధన ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తుండగా అదే స్థాయిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ ప్రభుత్వం ఎడాపెడా ధరలను పెంచి పేదలకు కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నది. 2014 సంవత్సరం నుంచి గడిచిన ఏడేండ్ల పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా భారీగా వంట గ్యాస్ ధరలను పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేక చతికిల పడుతోన్న నరేంద్ర మోడీ సర్కారు… ఇంధనం, వంట గ్యాస్ ధరల పెంపు వంటి చర్యలతో సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్ ధరలను చీటికి మాటికి పెంచడంతో కేంద్ర సర్కారు నవ్వులపాలవుతున్నది. వంటగ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచడం ద్వారా పేద కుటుంబాలకు అది పెనుభారం అవుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, మహిళా సంఘాల్లోని సభ్యులకు రాయితీపై ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్ర సర్కారే ధరల పెంపుతో వారి నడ్డి విరుస్తుండడం విడ్డూరంగా మారింది. ప్రస్తుతం సిలిండర్ల రీఫిల్లింగ్‌కు ఇస్త్తున్న రాయితీని తగ్గించడం, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
రోజుకు 15వేల సిలిండర్ల డెలివరీ
ఉభయ జిల్లాలో మొత్తం 42 ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 26 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో 3లక్షల 26వేల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజూ సరాసరి 9వేల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. ఒక నెలలో దాదాపుగా రెండున్నర లక్షల మేర వంట గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 16 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరి పరిధిలో 2లక్షల 10వేల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజూ 6వేల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. ఒక నెలలో దాదాపుగా లక్షా60 వేల సిలిండర్ల వాడకం జరుగుతున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతకుముందు వంట గ్యాస్ రాయితీని కేంద్రమే నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించేది. సిలిండర్ ధర చెల్లిస్తే సరిపోయేది. గ్యాస్‌కు రాయితీ ఇస్తున్నామని ప్రజలకు తెలియకపోవడంతో కేంద్రం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. 2013లో ఇది అమల్లోకి వచ్చింది. సిలిండర్ ధర, రాయితీ కలిపి వినియోగదారుడు ఏజెన్సీకి చెల్లించాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లో రాయితీ డబ్బులు జమ అవుతాయి. దీనికోసం వినియోగదారులు అప్పట్లోనే ఏజెన్సీలకు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించారు. ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీలో ఏ కంపనీ సిలిండర్ ఉంటే ఆ కంపనీ పేరుతో డబ్బులు వచ్చేవి. కరోనాకి ముందు రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్ము వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేది. మొదట్లో రాయితీలు సక్రమంగా ఇచ్చినా తర్వాత తగ్గిస్తూ వస్తోంది.