నవీపేట, ఆగస్టు 24 : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో మొరం దందా మూడు పువ్వులు ఆ రు కాయలుగా సాగుతున్నది. సెలవు దినాలతో పా టు రాత్రి వేళల్లోనూ ప్రభుత్వ అనుమతులు లేకుం డా ఇష్టారాజ్యంగా మొరం తరలిస్తూ లక్షలాది రూ పాయలను ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రంతోపాటు కమలాపూ ర్, జన్నేపల్లి, ఆశానగర్, లింగం గుట్ట, ఫకీరాబాద్, కోస్లీ, నారాయణపూర్ గ్రామాల శివారులో జేసీబీలతో మొరం తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వెంచర్లకు, ఇండ్ల బరంతీలకు తరలిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సూచనల మేరకు కమలాపూ ర్ శివారులో టిప్పర్లను అడ్డుకున్న గ్రామ సేవకులను మొరం మాఫియా బెదిరింపులకు గురి చేయ డం చర్చనీయాంశంగా మారింది. మొరం మాఫియాతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం లాభపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
మండలంలో అనుమతులు లేకుండా సాగుతున్న మొరం, ఇసుక వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. మొరం, ఇసుక వ్యాపారం చేయాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వాలనే నిబంధన ఉన్నది. కానీ నవీపేట మండలంలో నిబంధనలను తుంగలో తొక్కి దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
కనుమరుగవుతున్న వనరులు,వృక్ష సంపద
మొరం మాఫియా ఆగడాలు మితిమీరడంతో వనరులు, వృక్ష సంపద కనుమరుగవుతున్నది. మండలంలోని ఆయా గ్రామాల్లో గుట్టల ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లను జేసీబీలతో పెకిలించి మరీ మొరం తవ్వకాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలను వెచ్చించి హరితహారంలో భాగంగా ఒక పక్క మొక్కలను నాటుతుంటే మొరం మాఫియా ధనార్జనే ధ్యేయం గా గుట్టలను, వృక్ష సంపదను నాశనం చేస్తున్నది. మండలంలోని కమలాపూర్, నారాయణపూర్, నవీపేట, కోస్లీ, ఫకీరాబాద్, నందిగామ, యంచ, నాగేపూర్, నారాయణపూర్, అభంగపట్నం, ధర్మా రం, రెడ్డి ఫారం, మోకన్‌పల్లి, లింగమయ్యగుట్ట, అబ్బాపూర్(బీ), అబ్బాపూర్(ఎం),అల్జాపూర్ తదితర గ్రామాల్లో గుట్టల ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షా లు ఉన్నాయి.
మొరం మాఫియాపై అధికారులు సీరియస్..
మండలంలో రోజురోజుకు మొరం మాఫియా ఆగడాలు మితిమీరిపోతుండడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కమలాపూర్ శివారులో మొరం టిప్పర్లను అడ్డుకున్న గ్రామ సేవకులను మాఫియా బెదిరింపులకు గురి చేయడంపై అధికారులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం రవాణా చేసే మాఫియా పై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మండలంలోని కమలాపూర్ శివారు నుంచి మొరం తరలిస్తున్న 12 టిప్పర్లు, రెండు పొక్లెయిన్లను తహసీల్దార్ లత పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం తెలిసిందే.
మొరం దందాపై ప్రత్యేక నిఘా
అనుమతులు లేకుండా సాగుతున్న మొరం దందాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మొరం అక్రమ రవాణా చేసే వారిపై ఫిర్యాదులు వస్తే వాహనాలను సీజ్ చేస్తాం. ఇందుకు పోలీసు శాఖ సహకారం తీసుకుంటాం. అక్రమంగా మొరం వ్యాపారం చేస్తున్న వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
-లత, తహసీల్దార్, నవీపేట
మొరం అక్రమ రవాణాను అడ్డుకుంటాం
మండలంలో అనుమతి లేకుండా సాగుతున్న మొరం దందాను అడ్డుకుంటాం. ప్రతి రోజు తమ సిబ్బందితో పెట్రోలింగ్‌లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నాం. మొరం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల అనుమతులతో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
-యాకూబ్,ఎస్సై, నవీపేట