నిజామాబాద్ సిటీ, ఆగస్టు 8 : నిజామాబాద్ మార్కెట్ యార్డులో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాకు చెందినవారితోపాటు ఆయా జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి రైతులు పంట దిగుబడులను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువస్తారు. సీజన్లో పంట దిగుబడులను విక్రయించేందుకు రెండు నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో మార్కెట్ యార్డులోని షెడ్డు కింద పంట బస్తాలను ఉంచి రాత్రి వేళల్లో రెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న చిల్లర దొంగలు మార్కెట్‌యార్డులోకి చొరబడి అర్ధరాత్రి సమయంలో పంట బస్తాలను దొంగిలిస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కెట్‌యార్డులోకి వచ్చిన ఒకరు పసుపు బస్తాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైతు అప్రమత్తమై అతడిని పట్టుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఓ యూట్యూబ్ చానల్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలాసార్లు చోటుచేసుకున్నా మార్కెట్ కమిటీ అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రి సమయంలో బందోబస్తును ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.