నిజామాబాద్ సిటీ, ఆగస్టు 7: ప్రభుత్వం వాహన చట్టాలను మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ- చలాన్ పద్ధతిలో నిబంధనలు పాటించని వాహనాల ఫొటో తీసి జరిమానా విధిస్తున్నారు. ప్రతి రోజూ పోలీసులు వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మెట్రోపాలిటిన్ సిటీల్లో మాత్రమే ప్రభుత్వం ఈ చలాన్ పద్ధతిని అమలు చేసింది. స్వరాష్ట్రం అవతరించిన అనంతరం రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ-చలాన్ పద్ధతిని ప్రారంభించారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ఈ చలాన్ కేసులు నమోదవుతున్నా జరిమానాలు మాత్రం పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
పెద్దసంఖ్యలో కేసుల నమోదు..
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా ఈ చలాన్ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతోపాటు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు పాటించని వాహనాదారులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నా రు. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్, నెహ్రూ పార్కు, బోధన్ బ స్టాండ్, కంఠేశ్వర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతోపాటు ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి నెలా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పెండింగ్‌లో ఉన్న జరిమానాలను వాహనదారులు చెల్లించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు, నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ సమీక్షా సమావేశాల్లో పోలీసులను ఆదేశిస్తున్నారు. వాహనదారులు మాత్రం తమకు జరిమానాలు విధించినా.. చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడుకన్నా ఎక్కువ జరిమానాలు ఉంటే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
ఆటోమెటిక్ చలాన్ కెమెరాల ఏర్పాటు..
ప్రభుత్వం జిల్లాకేంద్రం నిజామాబాద్‌లో ఆటోమెటిక్ చలాన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు పోలీసులు తమ కెమెరాలో ఫొటోలు తీసి జరిమానా విధించారు. కానీ ఇప్పుడు మ్యానువల్ కాకుండా ఆటోమెటిక్ కెమెరా నిబంధనలు పాటించని వాహనాలను ఫొటో తీస్తున్నది. కెమెరా తీసిన ఫొటోలు నేరుగా హైదరాబాద్ ఆఫీస్‌కు ఆప్‌లోడ్ చేసి జరిమానా విధిస్తారు. రోజురోజుకు వాహన చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. త్వరలోనే నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ కెమెరాలు పోలీసులు ప్రారంభించనున్నారు.
నిబంధనలు పాటించాలి..
ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పెండింగ్‌లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.