నిజామాబాద్ సిటీ, ఆగస్టు 10: అంతర్జాతీయ బాలల ఒడంబడికలో చేర్చిన బాలల హక్కులు, న్యాయ చట్టం 2015 ప్రకారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు. కమిషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో బాల అదాలత్ బెంచ్‌ను మంగళవారం ఏర్పాటు చేసి బాలలు, వారి తల్లిదండ్రులు, పోషకుల నుంచి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ముందుగా కలెక్టర్ నారాయణరెడ్డి, కమిషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఈ కమిషన్ ద్వారా బాలలకు జీవించే, రక్షణ పొందే హక్కు కల్పించవచ్చన్నారు. అన్ని శాఖల అధికారులతో సమష్టిగా బాలల ఆరోగ్యం, విద్య, న్యాయం కోసం కమిషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ వ్యక్తినైనా కమిషన్ ముందు హాజరుపర్చడంతో పాటు మరెన్నో అధికారాలు ఈ కమిషన్‌కు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం ఏర్పడిన ఈ కమిషన్ కేవలం హైదరాబాద్‌లో ఉండి సమస్యలను వినడమే కాకుండా మన దగ్గరికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించడం గొప్ప విషయమన్నారు. అనంతరం విద్య, స్త్రీ శిశు సంక్షేమ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, కమిషన్ సభ్యులు బృందాధర్ రావు, అరుణ, రాగజ్యోతి, దేవయ్య, శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీ, అధికారులు పాల్గొన్నారు.
బాల అదాలత్‌కు 650 దరఖాస్తులు
బాల అదాలత్‌లో 650 దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు. బాలల అదాలత్ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరం ధ్రువపత్రాల కోసం ఎక్కు వ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అదే విధంగా హాస్టల్, వైద్య సదుపాయాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని యంత్రాంగం ఈ సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామ ని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రావు, సభ్యులను సన్మానించారు.