నిజామాబాద్ రూరల్, ఆగస్టు 8: నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా రాష్ట్ర ప్రభుత్వం క్యాంపు కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం కోసం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది.ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని నగర శివారులోని ఆర్యనగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన నిర్మించారు. అన్ని హంగులతో నిర్మించిన ఈ కార్యాలయ భవనం నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ భవనంలో ఎమ్మెల్యే చాంబర్‌తో పాటు సమావేశ మందిరం, పలు గదులు నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయలతో భవన నిర్మాణం పూర్తికాగా, అదనపు సౌకర్యాల కోసం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరో రూ. 30 లక్షల నిధులు మంజూరు చేయించి మొత్తం రూ. 1.30 కోట్లతో నిర్మించారు.
అధికారులతో సమీక్షలు ఇక్కడే..
నియోజకవర్గంలోని వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతి విషయమై అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కార్యాలయం ఒక వేదికగా ఉపయోగపడనున్నది. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల కోసం వినతులు సమర్పించుకునేందుకు ఎమ్మెల్యే కోసం వచ్చే ప్రజాప్రతినిధులకు కూడా సౌకర్యవంతంగా మారనున్నది.
నేడు ప్రారంభోత్సవం
రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు.
శుభ పరిణామం..
ప్రజల సమస్యలు విని త్వరితగతిన పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామం. గతంలో ఎవరూ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ప్ర జా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడానికి క్యాంపు కార్యాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేయడం గొప్ప విషయం. ఇక నుంచి క్యాం పు కార్యాలయంలో ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తాం. వాటిని పరిష్కరించేలా అధికారులకు సిఫారసు చేసే అవకాశముంటుంది.
-బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే