నవీపేట, ఏప్రిల్ 19: రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పోతంగల్ గ్రామం… ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అత్తగారి ఊరి. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కవిత.. పోతంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రైవేటు కంపెనీ సన్ నెట్వర్క్ సంస్థ ద్వారా రూ.1.50కోట్లతో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా కుంటుపడిన గ్రామం.. కేవలం తొమ్మిదేండ్లలోనే సర్వాంగ సుందరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత సహకారంతో, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు ప్రత్యేక చొరవతో రూ.13కోట్లతో పోతంగల్ రూపురేఖలు మారిపోయాయి.
బతుకమ్మ ఘాట్ ఏర్పాటు..
పోతంగల్ గ్రామ సమీపంలోని చెరువులో బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఏటా బతుమ్మ పండుగ సమయంలో బతుకమ్మలను చెరువులో నిమిజ్జనం చేసేందుకు మహిళలు ఇబ్బందులు పడేవారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో కండ్లారా చూసిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధతో చెరువు వరకు సీసీ రోడ్డు వేయించి, బతుకమ్మ ఘాట్‌ను నిర్మించారు.
గ్రామస్తుల హర్షం..
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ గ్రామాన్ని తొమ్మిదేండ్లలోనే సుందరంగా మార్చిన ఎమ్మెల్సీ కవితకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎల్లప్పుడూ కవితకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్.రాంకిషన్‌రావు సైతం గ్రామాభివృద్ధిలో భాగమవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సమైక్య పాలకుల హయాంలో ఆ గ్రామంలో అభివృద్ధి శూన్యం. దశాబ్దాలుగా గుంతల రోడ్లు, అస్తవ్యస్తంగా డ్రైనేజీలు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా.. ప్రగతిలో మాత్రం ఆమడ దూరంలో ఉండేది. తాగునీటి తిప్పలు.. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపించేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ ఊరి దశ మారింది. వీధి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ మిషన్ భగీరథ కుళాయి.. ఇలా అభివృద్ధి పథంలో నడుస్తోందీ ఈ ఊరు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అత్తగారి ఊరిపై మమకారంతో అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి బాటలో పయనిస్తున్న పోతంగల్ గ్రామంపై ప్రత్యేక కథనం…
కనిపించని మట్టి రోడ్లు..
పోతంగల్ గ్రామంలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలని నిర్మించడంతో ఎక్కడ కూడా మట్టి రోడ్లు కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపాటి వర్షాలకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి నడవడానికి వీలు లేకుండా ప్రజలు ఇబ్బందిపడే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రూ.4 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామంలోని ఎకరన్నర భూమిలో ఉన్న బండరాళ్లతోపాటు గుంతలను ఎమ్మెల్సీ కవిత రూ.40లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో అర్హులైన 30మందికి ఇండ్ల స్థలాల పట్టాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆర్.రాంకిషన్‌రావు కృషిచేస్తున్నారు.
రూ.1.33కోట్లతో ఫంక్షన్ హాల్..
గ్రామంలో వివాహం చేసేందుకు కల్యాణమండపాలకు అధిక ధరను చెల్లించాల్సిన పరిస్థితి. పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఇంటి వద్దే వివాహాలు జరిపేవారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో గ్రామంలో రూ.1.33 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ గ్రామస్తులకు సౌకర్యంగా మారింది. నామమాత్రపు చార్జీలతో ఈ కల్యాణ మండపంలో పెండ్లి, ఇతరత్రా శుభకార్యాలను నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. త్వరలో గ్రామస్తుల సమక్షంలో ఫంక్షన్ హాలు నిర్వహణ కమిటీ ఏర్పాటు కానున్నది. నూతనంగా ఏర్పడే కమిటీ నామినల్ ఫీజుతో ఫంక్షన్ హాల్‌ను నడుపనున్నది.
ఎమ్మెల్సీ కవిత సహకారంతో గ్రామాభివృద్ధి..
ఎమ్మెల్సీ కవిత సహకారంతో పోతంగల్లో అభివృద్ధి సాధ్యమయ్యింది. ఎన్నడూ లేని విధంగా రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో 37 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. గ్రామాభివృద్ధిలో బీఆర్ఎస్ నేత రాంకిషన్ రావు కృషి అభినందనీయం.
– టి.రవీందర్రావు, సర్పంచ్, పోతంగల్
షాదీ ముబారక్ పైసల్తో అల్లుడికి బైక్ కొనిచ్చాను..
మాది పేద కుటుంబం. నా కూతురికి పెండ్లి చేసే సమయంలో కట్నం ఇచ్చేందుకు డబ్బులు లేవు. మా అల్లుడికి షాదీముబారక్ వచ్చిన తర్వాత బైక్ కొనిస్తానని చెప్పి పెండ్లి చేశా ను. ఇటీవల షాదీముబారక్ కింద రూ.లక్షాపదహారు చెక్కు వచ్చింది. నేను ఒప్పుకున్న విధంగానే నా అల్లుడికి లక్ష రూపాయలతో కొత్త బైక్ కొనిచ్చాను. షాదీముబారక్ పథకం మాలాంటి పేదోళ్లకు చాలా ఉపయోగపడుతుంది. మాకు ఆసరా అయిన సీఎం కేసీఆర్ కలకాలం సల్లంగ ఉండాలి.
– ఎండీ అమీనా, పోతంగల్
బీఆర్ఎస్కు రుణపడి ఉంటాం..
మా గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు. గ్రామంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. వానకాలంలో బురద లేకుండా చేశారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నారు.
-ఖుషి పండిత్, శివాజీ యూత్ అధ్యక్షుడు, పోతంగల్
పోతంగల్ గ్రామానికి చెందిన ఇద్దరికి దళితబంధు పథకం కింద యూనిట్లు మంజూరు చేశారు. ఆరుగురికి యంత్రలక్ష్మి పథకం ద్వారా ట్రాక్టర్లను అందజేశారు. 150 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇద్దరు యువకులకు రూ.2లక్షల చొప్పున రుణాలిచ్చారు.