ఖలీల్‌వాడి, ఆగస్టు 7:నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నది. మొత్తం 45 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దుబాయ్, బహెరాన్, మస్కట్, మలేషియా, ఇరాక్, లండన్ తదితర దేశాలకు వెళ్లే వారి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి డోసు తీసుకున్న వారికి 29 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకునే అవకాశం కల్పించడంతో వినాయక్‌నగర్ ప్రాంతం జాతరను తలపిస్తోంది. వ్యాక్సిన్ కోసం వచ్చే వారు ఉదయం నుంచే బారు లు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్లే వారి కోసం వినాయక్‌నగర్‌లోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పా టు చేయడంతో నిత్యం కిక్కిరిసిపోతున్నది. పీహెచ్‌సీకి వచ్చేవారికి దవాఖాన సిబ్బంది టోకెన్ ఇస్తూ భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నా.. కొం తమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దవాఖాన సిబ్బందితో గొడవపడుతున్నారు. ఈ కేంద్రంలో విదేశాలకు వెళ్లేవారితోపాటు కాలనీవాసులకు చెందిన చిన్న పిల్లలకూ టీకాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, చికిత్సను అందిస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గల్ఫ్ వెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యం త్రాంగం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు మొత్తం 10,082 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 18 నుంచి 44 సంవత్సరాలలోపు మొదటి డోసు తీసుకున్నవారు 5,285 మంది, రెండో డోస్ తీసుకున్న వారు 3,716 మంది ఉన్నారు. 45 సంవత్సరాల పైబడి మొదటి డోసు తీసుకున్నవారు 612, రెండో డోస్ తీసుకున్నవారు 469 మంది ఉన్నారు.
కనిపించని భౌతిక దూరం
వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చిన వారు కొవిడ్ నిబంధనలు పాటించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. భౌతికదూరం పా టించి, సహకరించాలని కోరినా పట్టించుకోవడంలేదని దవాఖాన సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
29 రోజుల తర్వాతనే రెండో డోస్
నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్యారోగ్య ఆదేశాల మేరకు వినాయక్‌నగర్ పీహెచ్సీలో గల్ఫ్ బాధితులకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. 28 రోజుల తర్వాత వేసుకుంటే సౌదీలో వారిని అనుమతించడం లేదని తెలిసింది. 29 రోజుల తర్వాతనే రెండో డోసు వేసుకోవాలి. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-డాక్టర్ బి. శివశంకర్, ఇమ్యునైజేషన్ అధికారి