ఏర్గట్ల, ఆగస్టు 8: ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలతో పసుపు పంటలో చీడపీడలు వచ్చే ప్రమాదముందని, ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. గతేడాది అధిక వర్షాలతో దుంపకుళ్లు వచ్చి పసుపు రైతులు, అధికంగా నష్టపోయిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. అధిక వర్షాలతో పసుపులో వచ్చే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
దుంపకుళ్లు..
పసుపు పంటలో నీరు నిలిచిపోవడంతో దుంప కుళ్లిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో 50శాతం దిగుబడి తగ్గుతుంది. మొక్కల్లో తొలుత ముదురుఆకులు వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్కపై భాగం ఉన్న లేత ఆకులకు వ్యాపిస్తుంది. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. దుంపలు, కొమ్మలు కుళ్లి మెత్తబడిపోతాయి. నివారణకు పంట భూమిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీరు బయటికి వెళ్లేందుకు అవకాశం లేకుంటే వెంటక్సిల్, మాంకోజెబ్ గాని, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ గానీ ఇసుకలో కలిపి మడుల్లో నిల్వ ఉన్న నీటిలో చల్లడం మంచిది.
ఆకుమచ్చ తెగులు..
వాతావరణంలో అధిక తేమతో పసుపులో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి గోధుమరంగు మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్మలు ఎదుగుదల తగ్గి దిగుబడి, నాణ్యత తగ్గిపోతాయి. నివారణకు కార్బండీజమ్, మాంకోజెబ్ 2 గ్రాములు, ప్రొఫికొనజోల్ 1.5మిల్లీ లీటర్లను కలుపుకొని పిచికారీ చేయాలి.
పోషకధాతు లోపాలు నత్రజని..
వర్షం ద్వారా నత్రజని భూమిలో ఇంకిపోవడంతో లోపం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మొక్కలోని కింది భాగంలో ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఎరుపు రంగు చార ఆకు చివర ఏర్పడి క్రమంగా మధ్యస్త భాగం వరకు పాకుతుంది. దీని నివారణకు మొక్క నాటాక 40 రోజుల వ్యవధిలో ఒక బస్తా యూరియా వేసుకోవాలి. ఒక శాతం యూరియా ద్రావణాన్ని వారానికి రెండుసార్లు పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సమస్యను నివారించవచ్చును.
పొటాష్..
ఈ లోపంతో ఆకుల అంచులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. కాడ సన్నగా ఉండి సున్నితంగా సులువుగా వాలిపోతుంది. దీని నివారణకు ఒక బస్తా పొటాష్ని మూడు బస్తాల వేప పిండితో కలిపి చల్లుకోవాలి. డ్రిప్ సౌకర్యం ఉన్నవారు పది రోజులకోసారి 2కిలోల చొప్పున మల్టీకేను డ్రిప్ ద్వారా పంపించాలి.
ఇనుము..
లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగం పాలిపోతుంది. లోపం ఎక్కువైతే ఆకుపచ్చదనం కొల్పోయి తెల్లగా మారుతుంది. నివారణ లీటర్ నీటికి 5గ్రాముల ఫెరస్ సల్ఫేట్ లేదా అన్నభేది 10 గ్రాములు, 1గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకొని 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
జింకు..
ముదురాకుల్లో జింకులోపం లక్షణాలు కనిపిస్తాయి. మొక్క గిడసబారి పిలకలు తక్కువుగా పుడతాయి. లక్షణాలు గమనించగానే లీటర్ నీటికి 5గ్రాముల జింక్ సల్ఫేట్ అరలీటర్ సబ్బు నీటిలో కలిపి 15రోజుల్లో రెండుసార్లు పిచికారీ చేయాలి.
నీరు నిలువకుండా చూడాలి
వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పసుపు పంటలో నీరు నిలిస్తే తెగుళ్లు, లోపాలు వచ్చే అవకాశం ఉన్నది. పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చూడాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అధికారులను సంప్రదించి నివారణ చర్యలు చేపట్టాలి.