రెంజల్, ఆగస్టు 8 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి (గంగా) మహా హారతి కార్యక్రమాన్ని సో మవారం నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలో తొలి సోమవారం సాయం త్రం గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని కేశవ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిం చనుం డగా.. పుష్కర ఘాట్ కమిటీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఘాట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్ల పొదలను కూలీల సహాయంతో తొలగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప సర్పంచ్ దేవోళ్ల యోగేశ్, ఘాట్ కమిటీ చైర్మన్ గంగారాజు, కమిటీ సభ్యులు తెలిపారు. గంగా హారతి నిర్వహించే ఘాట్ ప్రాంతంలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, ఇతర పట్టణాలకు చెందిన ప్రముఖులు, భక్తులు రానుండగా.. కందకుర్తి గ్రామంలోని హనుమాన్ మందిరం నుంచి త్రివేణి సంగమ క్షేత్రం వరకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకనున్నారు.
ఐదు వారాల పాటు నిర్వహణ
శ్రావణ మాసంలో వచ్చే ఐదు సోమవారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ రోజుల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో దేవతలకు పవిత్ర జలాలతో భక్తులు మహా హారతి రూపంలో భక్తిని చాటుతారు. ప్రతి సోమవారం మహిళలు మంగళ హారతులతో చేరుకొని గోదావరి మాతకు హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే రాక
గోదావరి హారతికి మహారాష్ట్రలోని నాయగాం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేశ్ పవర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు జడ్పీటీసీ సభ్యురాలు మేక విజయ తెలిపారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ్ బలవత్రి గణేశ్జీ, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ధర్మాబాద్ నుంచి మూడు వందల మంది భక్తులు హాజరుకానున్నారు.హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.