నిజామాబాద్ సిటీ/ విద్యానగర్, ఆగస్టు 24 : విద్యాసంస్థలు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్నందున విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా పండుగ వాతావరణం కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించా రు. హైదరాబాద్ నుంచి వారు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీ టు పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నందున కరోనాకు ముందున్న పరిస్థితులను కల్పించాలని.. విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ఇందుకు మానిటరింగ్ కమిటీ ప్రతి రోజూ పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీల్లో టాయిలెట్స్ శానిటైజ్ చేయించాలని, గ్రామ పంచాయతీలు, బల్దియాల్లోని సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కిచెన్ షెడ్స్ శుభ్రపరచాలని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని, నల్లా కనెక్షన్లు లేని స్కూళ్లలో మిషన్ భగీరథ వాట ర్ కనెక్షన్ ఇప్పించాలని ఆదేశించారు. డ్రైనేజీలు శుభ్రం చేయించాలని.. పాఠశాల ఆవరణల్లో నీరు నిల్వకుండా చూడాలని డీపీవో, సీఈవో, జడ్పీ, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లలో పరిశుభ్రతపై ఈ నెల 30వ తేదీ వరకు హెడ్మాస్టర్ల తో సర్టిఫికెట్ తీసుకుని ఎంపీడీవోలు సమర్పించాలన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సీఎం కేసీఆర్ స్కూళ్లు ప్రారంభించడానికి నిర్ణయించారన్నారు.
విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించాలి..
విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హెడ్మాస్టర్లు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు అప్పజెప్పాలని మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు చేయించాలన్నారు. స్కూల్ కమిటీలు వేయాలన్నారు. విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా, శానిటైజర్ వాడేలా చూడాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలను సైతం పరిశీలించాలన్నారు. దేశంలోనే కరోనాను కట్టడి చేయడంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. విద్యాశాఖకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని పాఠశాలలను తప్పక సందర్శించాలన్నారు. అవసరమైన చోట చిన్నచిన్న మరమ్మతులు చేయించాలని సూచించారు. వీసీలో నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ సీఈ వో గోవింద్, డీఈవో దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్రకుమార్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ శరత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ట్రాన్స్‌కో ఎస్ఈ శేషారావు, ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, ఎస్టీ సంక్షేమ అధికారి అంబాజీ, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.