బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లలో గులాబీ దండు నిమగ్నమైంది. ఓరుగల్లు గడ్డపై నిర్వహించనున్న రజతోత్సవాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమైంది. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో అనుచరులతో సోమవారం సమావేశమయ్యారు. సభ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆర్మూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా ఓరుగల్లు సభకు తరలి వచ్చేలా చూడాలని సూచించారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి సమక్షంలో నగరానికి చెందిన మైనార్టీ యువకులు భారీగా గులాబీ గూటికి చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఏప్రిల్ 7: ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో రజతోత్సవ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ఓరుగల్లులో నిర్వహించనున్న సభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలు తరలి రావాలని నిర్ణయించారని, కానీ అంతకంటే ఎక్కువగా వెళ్లి సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 27న అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించాక వరంగల్‌కు బయల్దేరాలని సూచించారు.
చరిత్రలో నిలిచిపోయేలా 1500 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రధాన చౌరస్తాల్లో వాల్ పెయింటింగ్, పార్టీ నినాదాలు ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, సభకు తరలిరావడానికి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వరంగల్ సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, గండ్ర మధుసూదన్, మాజీ ఎంపీపీలు బాలమణి, పిప్పిరి ఆంజనేయు లు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు బలవంత్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జుకంటి మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, నల్లవెల్లి అశోక్, గోపిగౌడ్, రవియాదవ్ పాల్గొన్నారు.
-కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్