భీమ్గల్,ఆగస్టు 10 :గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగమైన జీవాల పెంపకాన్ని చేపట్టి జీవనం సాగిస్తున్నారు. అయితే వాటికి వచ్చే వ్యాధులపై అప్రమత్తం కాలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏఏ నెలల్లో ఏఏ వ్యాధులు జీవాలకు వస్తాయి, వాటికి ఏ మందులు తాగించాలి, ఇంజెక్షన్లు వేయించాలనే విషయం తెలియక ఆ యా జీవాలు రోగాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. దీంతో కాపరులు, యజమాను లు, రైతులు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. మందుల షాపుల వారిచ్చే మందులు తాగించడ మో, ఇంజెక్షన్లు వేయించడమో చేస్తూ జీవాలకు రోగాలు తగ్గక అవి చనిపోతుంటే బాధపడుతున్నారు. పెంపకందారులు నష్టపోకుండా జిల్లా పశుసంవర్ధక శాఖ రోగాల నివారణకు ప్రధానమైన నట్టల నివారణ మందును పంపిణీ చేస్తున్నది. నట్టల నివారణ మందును జీవాలకు ఎందుకు తాగించాలి, దీంతో కలిగే ప్రయోజనాలపై ఇన్చార్జి జేడీ భరత్ మహజన్ వివరిస్తున్నారు.
జీవాల ఆరోగ్యానికి, పునరుత్పత్తికి నట్టల నివారణ ఎంతో కీలకం. రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ వారి వృత్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నది. ఈ క్రమం లో జీవాల ఆ రోగ్యం ఎంతో కీలకం. జీవాలు ప్రధానంగా నట్టల సమస్యను ఎదుర్కొంటుంటాయి. వాటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యేటా నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా నట్టల నివారణ మందు తాగించే కార్యక్రమం ప్రారంభమైంది.
నట్టలతో నష్టాలు..
జీవాలను కుదుపునకు గురిచేసేవి నట్టలు. ఇవి శరీరంలోని పొట్టలోకి చేరి వాటి ఎదుగుదలను క్షీణింపజేస్తూ తీవ్రంగా దెబ్బతీస్తాయి. అంతర పరాన్నజీవులైన ఏలికపాములు, జలగలు,బద్దె పురుగులతో గొర్రెలు, మేకలు ఎక్కువగా మరణిస్తాయి. జీవాలలో ఉండే పరాన్నజీవుల గుడ్లు పేడ ద్వారా నేలపైకి చేరి లార్వాలుగా అభివృద్ధి చెందుతాయి. ఆ గడ్డిని జీవాలు తిన్నప్పుడు వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. బురద కుంటల్లో, నట్టలు ఉన్న నిల్వ నీటిని తాగడంతో నట్టలు జీవాల శరీరంలోకి చేరుతాయి.
నిర్ధారణ
పేడ పరీక్షను చేయించి వ్యాధిని నిర్ధారించవచ్చు. చనిపోయిన జీవాలను పరీక్షించినప్పుడు ఏవైనా నట్టలు ఉన్నట్లయితే మిగతా వాటికి నివారణ చర్యలు చేపట్టవచ్చు.
వ్యాధి లక్షణాలు
విరేచనాలు అవుతాయి. అందులో బద్దె పురుగులు కనిపిస్తాయి.
శరీరానికి అందాల్సిన పోషక పదార్థాలను నట్టలు శరీరంలో ఉండి తినడంతో జీవాలు బలహీనపడతాయి. కొన్ని రకాల అంతర పరాన్న జీవులు జీవాల శరీరం నుంచి రక్తాన్ని పీల్చుకోవడంతో రక్తహీనత కలిగి కండ్లు తెల్లగా పాలిపోయి ఉంటాయి.
జలగలతో కాలేయందెబ్బతింటుంది. గడ్డం కింద నీరు చేరి వాపు వస్తుంది. ఈ వాపు సాయంత్రం వేళల్లో కనిపిస్తుంది.
న్యూమోనియా కలిగే అవకాశం ఎక్కువ. శరీరంపై వెంట్రుకలు పెరుగుతాయి. కొన్ని సమయాల్లో రక్తపు విరేచనాలు అవుతాయి.
చికిత్స..
ఏడాదికి కనీసం నాలుగుసార్లు నట్టల నివారణ మందును తాగించాలి. పశు సంవర్ధక శాఖ రెండుసార్లు ఉచితంగా ఈ కార్యక్రమం చేపట్టి మందును జీవాలకు పంపిణీ చేస్తుం ది. మిగతా సమయంలో కాపరులు, రైతులు జీవాలకు సొంతంగా తాగించాలి.
ఏలిక పాములు ఉన్నట్లయితే ఆల్బెండజోల్ 5-10 మిల్లీ.గ్రా, లివామిజోల్ 7.5మిల్లీ.గ్రా తాగించాలి. జలగలు ఉంటే ఆక్సిజనైడ్, రఫాక్సినైడ్, క్లోజంటలాల్ వాడాలి. బద్దె పురుగులుంటే నిక్లోజమైండ్ 100 మిల్లీ.గ్రా వంటి మందులను తాగించాలి.
నట్టల నివారణ మందు తాగించాలి
జిల్లాలోని 8లక్షల93వేల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి జీవాలకు మందులను తాగిస్తున్నాం. భీమ్గల్ మండలంలో ఉన్న 56,149 జీవాలకు నట్టల నివారణ మందు అందజేయనున్నాం. పెంపకందారులు తప్పకుండా తమ జీవాలకు నట్టల నివారణ మందు తాగించాలి.