బాన్సువాడ, ఆగస్టు 8 : కొంత కాలంగా వరుస చోరీలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ జయపాల్ రెడ్డి తెలిపా రు. బాన్సువాడ అర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన సమీరొద్దీన్, అర్ఫాత్ కామారెడ్డి నుంచి పిట్లంకు బైక్ వెళ్తూ .. సిద్ధాపూర్ గ్రామశివారులో ఉన్న సంతోష్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వద్దకు వెళ్లారు. తమ బైక్ టైరు బాగాలేదని, దయచేసి తమ వద్ద ఉన్న ఫోన్ తీసుకొని ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని కోరారు. ఫోన్‌ను సంతోష్‌కు ఇవ్వగా తన వద్ద రూ.2500 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. వెంటనే అర్ఫాత్ ఇంకా కొంచెం ఎక్కువగా ఇవ్వండి అని చెబుతున్న సమయంలోనే సమీరొద్దీన్ సంతోష్ చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నాడు. చివరకు సంతోష్ వారికి రూ.2500 ఇవ్వగా సమీరొద్దీన్ నల్లటి పౌచ్ చేతిలో పెట్టి బైక్‌పై పిట్లం వైపు పారిపోయారు. సంతోష్ పౌచ్ తెరిచి చూడగా అందులో గ్లాస్ మాత్రమే ఉంది. దీంతో మోసపోయానని గ్రహించిన సంతోష్.. పిట్లంలో ఉండే బావమరిది పరశురాంనకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు.
పరశురాం వెంటనే పిట్లంలో సమీరొద్దీన్, అర్ఫాత్ల బైక్‌ను ఆపి తమ బావ సంతోష్‌ను మోసం చేసింది మీరే కదా అని ప్రశ్నించగా వారు డబ్బులు తిరిగి ఇచ్చినట్టే ఇచ్చి హెల్మెట్‌తో కొట్టి పారిపోయారు. ఈ విషయమై సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఆదివారం పిట్లంలో బైక్ వస్తున్న వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.2,500 నగదు, మూడు బ్లాక్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ జయపాల్‌రెడ్డి తెలిపారు. సమీరొద్దీన్పై అబిడ్స్, మైలారదేవ్‌పల్లి, కామారెడ్డి, నవీపేట, ఇందల్వాయి, నిజామాబాద్ , జక్రాన్‌పల్లి, భిక్కనూర్‌తో పాటు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లలో కేసు లు ఉన్నాయని తెలిపారు. చాదర్‌ఘాట్ పోలీసులు పీడీ యాక్టులో రిమాండ్ చేసినట్లు వివరించారు. తక్కువ డబ్బులకే వస్తువులు ఇస్తామని చెప్పి మోసం చేసే వారి నుంచి, అనుమానాస్పదంగా తిరిగే వారి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ఆయన వెంట బాన్సువాడ రూరల్ సీఐ చంద్రశేఖర్ , పిట్లం ఎస్సై రంజిత్, బీర్కూర్ ఎస్సై రాజేశ్ ఉన్నారు.