డిచ్పల్లి, ఆగస్టు 24: ఇందూరు ముద్దుబిడ్డకు మ రో అరుదైన అవకాశం లభించింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన రిక్క లింబాద్రి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా కొనసాగిన ప్రొఫెసర్ పాపిరెడ్డి పదవీకాలం ము గిసింది. దీంతో వైస్ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ రిక్క లింబాద్రిని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ లింబాద్రి గతంలోనూ ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన ట్రాక్ రికార్డును పరిశీలించిన సీఎం కేసీఆర్.. చైర్మన్‌గా అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
టీయూతో అనుబంధం…
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఎన్నికైన ప్రొ ఫెసర్ లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయంతో ఎనలేని అనుబంధం కొనసాగుతూ వస్తున్నది. ప్రొఫెసర్ లింబాద్రి నిజామాబాద్ జిల్లా వాసి కావడంతో పాటు తెలంగాణ విశ్వవిద్యాలయానికి రెండుసార్లు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 2013, 16లో విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా పనిచేసి ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందారు. అంతకుముందు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించి పలు పదవులను ఆయన సమర్థవంతంగా పోషించారు.
వీసీగా అవకాశాలు వచ్చాయి…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ ఇతర సభ్యులను నియమించిన సమయంలో ప్రొ ఫెసర్ రిక్క లింబాద్రి వైస్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభు త్వం నియమించింది. ఈ పదవిలోనూ ఆయన అనేక ఉన్నత నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయంతో పాటు ఉస్మానియాకు వైస్‌చాన్స్‌లర్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించినా ఆయన తీసుకోలేదు. ప్రభుత్వం కూడా మరింత ఉన్నత పదవిని కట్టబెట్టాలని ఆలోచనతో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఐదేండ్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిలో ప్రొఫెసర్ పాపిరెడ్డి తర్వాత లింబాద్రి చైర్మన్‌గా ఎన్నుకుంటారని సమాచారం చాలా మందిలో నానింది. చివరకు అదే నిజమైంది ఇప్పుడు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బాజిరెడ్డి..
సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించడంపై రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంచి ఆలోచన కలిగిన విద్యావంతుడు, పరిపాలనా అనుభవం కలిగిన దళిత ముద్దుబిడ్డ ఆర్.లింబాద్రిని నియమించడం శుభపరిణామమని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారన్నారు. సీనియర్ ఐఏఎస్ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ పార్థసారథి, రిక్క లింబాద్రి హయాంలో ఎంతో శ్రమించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్ గుర్తింపు తెచ్చారన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న లింబాద్రికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా విధులు అప్పజెప్పడం ఎంతో అభినందనీయమన్నారు. తన సొంత గ్రామానికి చెందిన లింబాద్రిని ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించడం తనకెంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.