సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 19, 2020 , 01:32:33

నేడే ముహుర్తం

నేడే ముహుర్తం

  • నేడు నిర్మల్‌, ఖానాపూర్‌ 
  • సెగ్మెంట్లలో రైతు వేదికల ప్రారంభోత్సవం
  •  హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి, అల్లోల
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఉమ్మడి జిల్లాలో 305 చోట్ల నిర్మాణాలు సిద్ధం

వ్యవసాయ శాఖలో మరో విప్లవాత్మక మార్పునకు సమయం ఆసన్నమైంది. అన్నదాతలకు సమగ్ర సాగు సమాచారాన్ని స్థానికంగా అందించే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభోత్సవానికి వేళైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 305 చోట్ల భవనాలు పూర్తికాగా, వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నిర్మల్‌ మండలం చిట్యాల్‌, ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో ఇప్పటికే సిద్ధం కాగా, శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది.                   - నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, తెలంగాణ : రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వారికి ప్రత్యేకంగా వేదికలను నిర్మించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 305 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ప్రతి చోట రైతు వేదిక నిర్మించారు. వీటన్నింటి నిర్మాణం పూర్తవగా, ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్‌ మండలం చిట్యాల్‌, ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో రైతు వేదికలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్‌ మండలం చిట్యాలలో, మధ్యాహ్నం 2.30 గంటలకు ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో రైతు వేదికను ప్రారంభిస్తారు. మంత్రుల పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రైతులకు అందుబాటులో ఉండేలా..

రైతులు ఒకే చోట కూర్చొని సమావేశమయ్యేందుకు, సాగులో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన వేదికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 305 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ఆయా చోట్ల వేదికలను నిర్మించారు. వీటి నిర్మాణం ఇప్పటికే పూర్తవగా, కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు ఉన్నాయి. వీటిని వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22లక్షల నిధులు కేటాయించారు. ఇందులో రూ.10లక్షలు వ్యవసాయశాఖ నుంచి కేటాయించగా, మిగతా రూ.12లక్షలు ఉపాధిహామీ నిధుల నుంచి మంజూరు చేశారు. రైతు వేదికల్లో సమావేశ మందిరం, ఏఈవో కార్యాలయం, గోదాములు నిర్మించారు. రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు కూడా ఇక్కడి నుంచే అందించనున్నారు. రైతులు ఇక్కడే సమావేశమై సాగులో నూతన విధానాలు, సాధకబాధకాలు, ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోనున్నారు. రైతులతో వ్యవసాయశాఖ అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. రైతు వేదికలు అందుబాటులోకి వస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


నేడు మంత్రుల రాక

ఖానాపూర్‌/సోన్‌ : నిర్మల్‌, ఖానాపూర్‌ మండలంలో శనివారం ఇద్దరు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పలు ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు. నిర్మల్‌ మండలంలోని చిట్యాల గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ఉదయం 11. 30 గంటలకు ప్రారంభిస్తారని సర్పంచ్‌ పడకంటి రమేశ్‌ రెడ్డి తెలిపారు. ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో రైతువేదిక భవనానికి, సత్తెనపల్లె గ్రామ పంచాయతీ రాంరెడ్డిపల్లె శివారులో ఏర్పాటు చేసిన ఏఆర్‌ఎస్‌ ఆగ్రో ఇండస్ట్రీని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే రేఖానాయక్‌ తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. 


logo