వేగంగా.. సులభంగా..

పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
- మొదటి రోజు ఆరు.. రెండో రోజు ఏడు పట్టాలు
- ‘కార్డు’ టెక్నాలజీతో ప్రక్రియ పూర్తి
- స్లాట్, ఎల్ఆర్ఎస్ ఉంటేనే పని
- మ్యుటేషన్‌తోపాటు పాస్బుక్కు జారీ
- లంచాలు, డాక్యుమెంట్ రైటర్లకు చెక్
నిర్మల్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, భైంసా, ఖానాపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా.. రెండు రోజులుగా యథావిధిగా కొనసాగుతున్నాయి. గతంలో అన్ని రకాల ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. డాక్యుమెంట్ల కోసం రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. మ్యుటేషన్లకు సంబంధించి.. వ్యవసాయ భూములు అయితే తహసీల్ కార్యాలయాలు, వ్యవసాయేతర ఆస్తులు అయితే గ్రామ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్ కార్యాలయాల్లోనే చేస్తూ ఆ వెంటనే మ్యుటేషన్ చేస్తున్నారు. అప్పటికే భూమి ఉన్న వారికి పాత పట్టాదారు పాసుపుస్తకంలో ప్రింట్ చేసి ఇస్తుండగా.. కొత్తగా భూమి కొంటే పాసుపుస్తకం పోస్టులో పంపిస్తున్నారు. వ్యవసాయేతర భూములకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం చేశారు. కాగా, మొదటి రోజు ఆరు.., రెండో రోజు ఏడు రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
అన్ని సేవలు ఒకే చోట..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కేవలం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తుండగా.. గతాని కంటే పూర్తి భిన్నంగా ప్రక్రియ కొనసాగుతున్నది. గతంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 100-150 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. దీంతో ఆఫీసులు కొనుగోలు, అమ్మకందారులు, సాక్షులతో సందడిగా ఉండేవి. కొన్నిసార్లు స్లాట్ బుకింగ్ చేశాక.. రెండు రోజుల సమయం కూడా పట్టేది. ప్రస్తుతం కాలయాపన లేకుండా వేగంగా చేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతున్నది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన పెట్టారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన వారు డబ్బులు చెల్లిస్తే.. ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు. ప్రొసీడింగ్ జారీ అయ్యాక.. పీటీఐఎన్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబరు ఆధారంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక.. రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు మ్యుటేషన్ చేసి సర్టిఫికెట్ అందిస్తున్నారు. పాస్ పుస్తకం ప్రింటింగ్ ఇవ్వడంతోపాటు.. కొత్త పాస్ పుస్తకం(మెరూన్ రంగు)ను పోస్టాఫీసులో పంపిస్తారు. మ్యుటేషన్‌కు ఒక శాతం, పాస్ పుస్తకం కోసం రూ.300 చెల్లించాలి. అన్ని సేవలు ఒకేచోట అందుతుండగా.. ప్రజలకు చాలా వరకు ఇబ్బందులు తప్పాయి.
భూ తగాదాలకు చెక్..
ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తుండగా.. లంచాల బెడద తప్పింది. మరోవైపు డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండా పోయింది. ఆన్లైన్లో పీటీఐఎన్ నంబర్ ఎంటర్ చేయగానే.. విక్రయం చేసే వారి పూర్తి వివరాలు వస్తాయి. దీంతోపాటు డాక్యుమెంట్లు కూడా సిద్ధమై ఉండడంతో.. అందులో కొనుగోలు చేసేవారి వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. సాక్షుల పేర్లు కూడా ముందే నమోదు చేయాలి. ఎవరికి పైసలు ఇవ్వకుండా.. కార్డు టెక్నాలజీతో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాస్ పుస్తకం పొందేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వ్యవసాయేతర భూములు/ఆస్తుల వివరాలు ఆన్లైన్లో ఉండగా.. పీటీఐఎన్ నంబర్ లేని వారు గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి పొందవచ్చు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా.. పారదర్శకంగా, వేగంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు పాస్ పుస్తకం ప్రింట్ పొందవచ్చు. తాజా విధానంతో ఆస్తుల తగాదాలకు అవకాశం లేకుండా పోయింది.అరగంటలోనే రిజిస్ట్రేషన్
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం మూడు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో కరిపె రాజారాం, అజ్రాబేగం ఖానాపూర్‌లో కొనుగోలు చేసిన ఇండ్లను, నక్కావార్ గజేందర్కుమార్ మస్కాపూర్‌లో కొనుగోలు చేసిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరందరూ కూడా సోమవారమే ఆన్లైన్లో స్లాట్‌బుకింగ్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు అమ్మినవారు, కొనుగోలుదారులు, సాక్షులు కలిసి ఖానాపూర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న రిజిస్ట్రార్‌ను కలిశారు. మహేందర్ అమ్మిన వారి, కొనుగోలు చేసిన వారి వివరాలు తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి చలానా రిసిప్ట్ తీసుకొని, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాడు. సాక్షుల సమక్షంలో అమ్మడం, కొనడం సమ్మతమేనా అని ఇద్దరిని అడిగాడు. అనంతరం అక్కడే ఉన్న క్లర్క్ దరఖాస్తు ఫారం నింపి ఇచ్చాడు. ఇరువురి ఫొటోలు తీసుకొని, కంప్యూటర్లో అమ్మకందారు వివరాలు, ఫొటోలు తొలగించి, కొనుగోలుదారు ఫొటోలు, వివరాలు అప్లోడ్ చేశారు. అనంతరం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నకలును కొనుగోలుదారుకు అప్పగించాడు. ఇదంతా ఒక్కొక్కరికి అరగంట వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయింది. కాగా.. రెండో రోజైన మంగళవారం కూడా ఇండ్ల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఎల్ఆర్ఎస్పై ఇంకా తుది నిర్ణయం కానందున ఖాళీ స్థలాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. కాగా.. మూడు స్థిరాస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు చలానా రూపంలో ప్రభుత్వానికి రూ.2.41లక్షల ఆదాయం సమకూరిందని మహేందర్‌రెడ్డి తెలిపారు.
పది నిమిషాల్లోనే
నిర్మల్ అర్బన్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం అమావాస్య కారణంగా ఒక్క రిజిస్ట్రేషన్ కాలేదు. రెండో రోజైన మంగళవారం నాలుగు రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
చాలా సులువైంది..
ధరణి సేవల ద్వారా ఖానాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఒకరు కొనుగోలు చేసిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌కు సాక్షి సంతకం చేయడానికి వచ్చాను. కార్యాలయానికి వెళ్లిన కేవలం 25 నిమిషాల్లోపు మా పనులన్నీ అధికారులు పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఇచ్చారు. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక మూడు రోజులకు పత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు వెంటనే అందిస్తున్నారు.
- రామగిరి నరేశ్, సాక్షి, పద్మావతినగర్, ఖానాపూర్
తాజావార్తలు
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్‌లో విద్యాబాలన్ సినిమా నట్‌ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
- పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
- ఐస్‌క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!