శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Dec 01, 2020 , 04:02:49

రొయ్య పెంపకం.. ఉపాధికి మార్గం..

రొయ్య పెంపకం..  ఉపాధికి మార్గం..

  • నిర్మల్‌ జిల్లాలో 46.99 లక్షల పెంపకానికి ఏర్పాట్లు 
  • త్వరలో మంత్రి చేతుల మీదుగా రిజర్వాయర్లలో వదిలే కార్యక్రమం
  • మత్స్య సొసైటీలకు ఆర్థిక చేయూత.. 

సారంగాపూర్‌ : నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా ఈ యేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్లలో చేపపిల్లను వదిలే కార్యక్రమం పూర్తికావడంతో, రొయ్యపిల్లల పెంపకానికి అధికార యం త్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలో 187 పురుష, మహిళా మత్స్యకార సంఘాలు ఉన్నాయి. ఈ సం ఘాల్లో 12,500 మంది సభ్యత్వం కలిగి ఉండగా, 2500 మంది మత్స్యకారులు  లైసెన్స్‌ కలిగి ఉన్నా రు. 2020-2021 సంవత్సరానికి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సమీకృత మ త్స్యశాఖ అభివృద్ధి పథకం ద్వారా నీలకంఠ రొయ్యపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే నిర్మల్‌ జిల్లాలోని నాలుగు రిజర్వాయర్లలో 46.99 లక్షల రొయ్యపిల్లలను పెంచాలని ఏర్పాట్లు చేశారు. ఇందులో సుద్దవాగులో 6.79 లక్షలు, స్వర్ణలో 4.38లక్షలు, ఎస్సారెస్పీలో 31.23 లక్షలు, కడెంలో 4.59 లక్షల రొయ్య పిల్లలను వదలడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరు నెలల్లో పెరుగుదల.. 

రొయ్య పిల్లలను రిజర్వాయర్‌లో వదిలిన అనంతరం ఎదిగేందుకు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో ఒక్కో రొయ్య 100-150 గ్రాముల బరువు పెరుగుతాయి.  రొయ్యలకు మంచి డిమాండ్‌ ఉండడంతో మత్స్యకారులు మార్కెట్‌లో కిలోకు రూ. 300-రూ.400 అమ్ముకొని ఆర్థికంగా లాభాలు గడిస్తున్నారు. ప్రభుత్వం మూడేండ్ల నుంచి రొయ్య పిల్లలను ఉచితంగా అందించి ఆదుకుంటుండడంతో మత్స్యకార సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమం త్వరలో ఉంటుందని నిర్మల్‌ జిల్లా మత్స్యశాఖ ఏడీ దేవేందర్‌ తెలిపారు.   

నిర్మల్‌ జిల్లాలో  వదిలే రొయ్య పిల్లలు, సంఘాల వివరాలు..

మత్స్యకార సహకార సంఘాలు : 187
పురుష సంఘాలు : 147
మహిళా సంఘాలు : 40
సభ్యత్వం కలిగిన మత్స్యకారులు : 12,500
లైసెన్స్‌ కలిగినవారు : 2,500
వదిలే రొయ్య పిల్లలు : 46.99 లక్షలు
రిజర్వాయర్లు : 04
రిజర్వాయర్‌లో వదిలే సీడ్‌ : నీలకంఠ రొయ్యలు