గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Feb 06, 2020 , 00:09:21

సమరానికి సై

సమరానికి సై
  • నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
  • అభ్యర్థులకు మార్గదర్శకాలు జారీ
  • 17మంది ఎన్నికల అధికారుల నియామకం
  • ఇదివరకే తుది ఓటరు జాబితా విడుదల
  • ఒక సభ్యుడు ఒక్క చోట పోటీకి అర్హులు
  • పీఏసీఎస్‌ కేంద్రాల్లో మూడురోజుల పాటు స్వీకరణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు నిర్మల్‌లో రైతు సేవా సహకార సంఘం ఉంది. మొత్తం 17 సంఘాలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించేందుకు  రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌ ఈనెల 3వ తేదీన నోటిఫికేషన్‌ జారీ  చేయగా, గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు పీఏసీఎస్‌లలో  నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతి పీఏసీఎస్‌ పరిధిలో 13 నియోజకవర్గాలు(డైరెక్టర్లు) ఉండగా, అన్నింటికి కలిపి సంబంధిత పీఏసీఎస్‌ కేంద్రంలో నిర్ణీత తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి డైరెక్టర్ల ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో  పోలింగ్‌, ఓట్ల లెక్కింపు 


ప్రక్రియ చేపట్టనుండగా, ఇందుకోసం పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, పరిశీలన కూడా పూర్తయ్యింది. డైరెక్టర్ల ఎన్నిక తర్వాత 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల్లోపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను ఆయా పీఏసీఎస్‌లలో నిర్వహిస్తారు.కుభీర్‌, కుంటాల, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్‌ మండలంలోని ము ఠాపూర్‌, మంజులాపూర్‌, సారంగాపూర్‌ మండలంలోని ఆలూరు, కౌట్ల, ముథోల్‌ మండలంలోని బిద్రెల్లి, తానూరు మండలంలోని హంగిర్గా, దిలావర్‌పూర్‌ మండలంలోని బన్సపల్లి, ఖానాపూర్‌ మండలంలోని సత్తన్నపల్లి, ఖానాపూర్‌, కడెం మండలంలోని పాండ్వాపూర్‌, భైంసా మండలంలోని మిర్జాపూర్‌ సహకార సంఘాలు ఉండగా, జిల్లా కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం ఉంది. 


జిల్లాలో మొత్తం 35,062మంది ఓటర్లుండగా, స్త్రీలు 8429, పురుషులు 26,633 మంది ఉన్నారు. ఈ ఓటర్లు 221మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. పీఏసీఎస్‌ల పరిధిలో 13మంది డైరెక్టర్‌ స్థానాలు ఉండగా, ఎస్సీ మహిళ-1, ఎస్సీ జనరల్‌-1, ఎస్టీ జనరల్‌-1, బీసీ జనరల్‌-2, జనరల్‌ మహిళ-2, మిగతా ఆరు డైరెక్ట స్థానాలు జనరల్‌ కేటగిరిలో ఉంచారు. ప్రతి పీఏసీఎస్‌ కోసం ఒక ఎన్నికల అధికారిని నియమించగా.. వ్యవసాయ, విద్యా శాఖ నుంచి తీసుకున్నారు. పీజీహెచ్‌ఎంలు, మండల వ్యవసాయ శాఖాధికారులు, ఏడీఏలను ఎన్నికల అధికారులుగా నియమించారు. 


మార్గదర్శకాలివే..

సహకార ఎన్నికల్లో ఎంతో కీలకమైన నామినేషన్లకు సంబంధించి.. సహకార శాఖ రిజిస్ట్రార్‌  మార్గదర్శకాలను విడుదల చేశారు. డైరెక్టరుగా నామినేషన్‌ వేయాలనుకునే వారు.. సంబంధిత పీఏసీఎస్‌లో సభ్యుడై ఉండాలి. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో సభ్యుడు కాకున్నప్పటికీ ఇప్పటికే ప్రకటించిన ఓటరు జాబితాలో మాత్రం ఆ పీఏసీఎస్‌లో ఓటరుగా నమోదై ఉంటే సరిపోతుంది. డైరెక్టరుగా పోటీ చేసే వ్యక్తిని ఒకరు ప్రతిపాదించాల్సి ఉండగా, మరొకరు బలపరచాల్సి ఉంటుంది. ప్రతిపాదించే, బలపరిచే వారు మాత్రం.. సంబంధిత పీఏసీఎస్‌లో సభ్యులై ఉండడంతో పాటు ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక్క నియోజకవర్గంలో రెండు సెట్ల నామినేషన్లు మాత్రం దాఖలు చేయొచ్చు. 


నామినేషన్ల పరిశీలన అనంతరం ఒక సెట్‌ ఉపసంహరించుకుంటే సరిపోతుంది. నామినేషన్ల పత్రాల దాఖలుకు సంబంధించి ఫీజులను సైతం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.500, బీసీలకు రూ.750, ఓసీలకు రూ.వెయ్యి చొప్పున దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండడంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఓటర్లను తమకు మద్దతుగా నిలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.logo