గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 24, 2020 , 02:01:29

గెలుపుపై ధీమా!

గెలుపుపై ధీమా!పురపోరులో కీలకఘట్టమైన పోలింగ్‌ ముగియడంతో ఇక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. గెలుపోటములపై ఎవరి లెక్క వారిదే.. గెలిచేదెవరో.. ఓడేదెవరో.. మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరించనుందో.. దురదృష్టం ఎవరిని వెంటాడనుందో.. రేపు (శనివారం) తెలియనుంది.. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల (నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో 80 వార్డులకు గాను ఐదు ఏకగ్రీవమవగా, 75 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. బరిలో 296 అభ్యర్థులు ఉండగా, వారి భవిష్యత్‌ స్ట్రాంగ్‌ రూంల్లో భద్రంగా ఉంది. మరోవైపు గెలుపోటములపై జోరుగా పందెంలు కాస్తున్నారు.
   -నిర్మల్‌/నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరించనుందో.. దురదృష్టం ఎవరిని వెంటాడనుందో రేపు (శనివారం) తెలియనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.జిల్లాలో మూడు మున్సిపాలిటీలుండగా.. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో 80వార్డులుండగా.. ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 75వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. 296మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జిల్లాలో 1,37,988మంది ఓటర్లుండగా.. 91,598మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో సగటున 66.38శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తవగా.. ఇక అధికారులు కౌంటింగ్‌ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నెల 25న నిర్మల్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బ్యాలెట్‌ బాక్స్‌లను మూడు మున్సిపాలిటీల నుంచి తరలించి పాలిటెక్నిక్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. శనివారం మూడు మున్సిపాలిటీల్లోని 75వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

లెక్కింపునకు ఏర్పాట్లు

నిర్మల్‌ మున్సిపాలిటీలోని 42వార్డులకుగాను రెండు వార్డులు ఏకగ్రీవం కాగా.. 40వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ వార్డుల ఓట్ల లెక్కింపు కోసం 14టేబుళ్లను ఏర్పాటు చేయగా.. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. భైంసాలో 26వార్డులుండగా.. మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. 23వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 12 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. ఖానాపూర్‌లో 12వార్డులుండగా.. ఆరు టేబుళ్లను ఏర్పాటు చేయగా.. రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే టేబుళ్లు, డ్రమ్ములు, పత్రాలు, ఇతర సామాగ్రి, ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఇతర ఏర్పాట్లు, వసతులు కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎవరి లెక్కల్లో వారు..

జిల్లాలో 75వార్డులకు 296మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిర్మల్‌లో 148మంది, భైంసాలో 88మంది, ఖానాపూర్‌లో 60మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్ట్రాంగ్‌ రూంల్లో వీరి భవిష్యత్‌ భద్రంగా ఉండగా. .మరికొద్ది గంటల్లో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. తేలిపోనుంది. మున్సిపల్‌ పోలింగ్‌ ముగియడంతో.. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారు తలమునకలై ఉన్నారు. మున్సిపాలిటీల వారీగా ఎన్ని సీట్లు గెలుస్తాం.. ఏఏ వార్డులను దక్కించుకుంటాం.. ఎక్కడ ముందున్నాం.. ఎక్కడ వెనుకబడ్డామనే చర్చలు, సమాలోచనలు, సమీక్షలు చేయడంలో గురువారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బిజీబిజీగా గడిపారు. ఎవరికి వారు తాము గెలుస్తామని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం గుబులు మొదలైంది. పైకి గెలుస్తామని చెబుతున్నా.. సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలతో వివరాలను ఆరా తీస్తున్నారు. గెలుస్తామని చెప్పినప్పుడు పైకి ముఖంలో ఆనందం కన్పిస్తున్నా.. ఫలితాలు ఎలా వస్తాయోననే ఆందోళన మాత్రం లోపల ఉంటుంది. ఎవరి లెక్కలు వారు చేసుకుంటున్నా.. ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా.. లెక్కింపు పూర్తయ్యే వరకు ఫలితాలపై ఉత్కంఠ మాత్రం తప్పేలా లేదు. కొత్తగా పుర పదవులను దక్కించుకునేదేవరో.. పాత వారికి పదవులు పదిలంగా ఉండేదెవరికో.. మరికొద్ది గంటలు గడిస్తే గాని తేలని పరిస్థితి నెలకొంది. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోటాపోటీగా ఉన్న వార్డుల్లో పందెంరాయుళ్లు భారీగా కాస్తున్నారు. ఆయా పార్టీలకు మున్సిపాలిటీల వారీగా వచ్చే స్థానాలపై, అభ్యర్థుల గెలుపోటములపై, మెజార్టీలపై జోరుగా పందెంలు కాస్తున్నారు. ఈ పందెంలలో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. మరి కొద్ది గంటలు గడిస్తేగాని స్పష్టత రానుంది. నిర్మల్‌ పట్టణంలోని మూడు వార్డులపై జోరుగా బెట్టింగు సాగుతున్నది.logo
>>>>>>