Engineering | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్నదా? ఇంజినీరింగ్‌కు మళ్లీ డిమాండ్ తీవ్రమవుతున్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్ ( TS EAMCET )కు భారీగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఇంజినీరింగ్‌కు డిమాండ్ పెరుగుతున్నది. ఇంటర్ తర్వాత పైచదువుల కోసం అత్యధికులు ఇంజినీరింగ్‌వైపు చూస్తున్నారు. డిగ్రీ ( Degree )కి బదులుగా బీటెక్ ( BTech ) చదువులవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. నిరుడు నుంచి ఈ ట్రెండ్ క్రమంగా మారుతుండగా, ఈ ఏడాదికి బీటెక్ సీట్లకు డిమాండ్ తీవ్రమైంది.
గడువు సోమవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డుస్థాయిలో 3.05 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్‌కు 1,95,515, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,08,457 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ రెండు విభాగాలకు కలిపి 335 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంసెట్‌కు హాజరుతో పాటు ప్రవేశాలు పొందుతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతున్నది. నాలుగేండ్లుగా ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గి విద్యార్థులు డిగ్రీ వైపు మళ్లారు. కానిప్పుడు మరలా ఇంజినీరింగ్‌కు క్రేజ్ క్రమంగా పెరుగుతుండగా, డిగ్రీకి తగ్గుతూ వస్తున్నది. దేశంలోని సీఎస్ఈలో 21 శాతం సీట్లు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. ఇటీవలీకాలంలో ఈ సీట్లపైపే అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉండటం, కంపెనీలు మంచి ప్యాకేజీలిస్తుండటంతో ఈ సీట్లకు డిమాండ్ తీవ్రమవుతున్నది.