TG ICET | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025 -26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్ష ఈ నెల 8, 9 తేదీల్లో (ఆదివారం, సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష సందర్భంగా ఎగ్జామ్ సెంటర్ల గేట్లను పరీక్షకు 15 నిమిషాల ముందే క్లోజ్ చేస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు.
రెండు రోజుల్లో మూడు సెషన్లల్లో ఐసెట్ పరీక్ష జరుగుతుందని కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి అన్నారు. మొదటి సెషన్ ఈనెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు, ఇక మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఇక ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంట వరకు మూడో సెషన్లో పరీక్ష జరుగుతుందన్నారు. దీంతో పరీక్షలు ముగుస్తాయయని పేర్కొ న్నారు. ఉదయం సెషన్లో 9: 45 గంటలు, మధ్యాహ్నం సెషన్లో 2: 15 గంటలకే గేట్లు మూసేస్తామని చెప్పారు. 16 జోన్లల్లో 96 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఈ సారి మొత్తం 71,757 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 34,409 మంది పురుషులుండగా, 37,331 మంది మహిళలున్నారు. హాల్‌టికెట్ నంబర్లపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్‌చేసి సెంటర్ల అడ్రస్ తెలుసుకోవచ్చని ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు.