TG EAPCET 2025 results | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. విభాగాలవారీగా టాప్ ర్యాంకర్ల వివరాలను కూడా విడుదలచేస్తారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు పరీక్షలు నిర్వహించారు.
అభ్యంతరాలు 42 మాత్రమే..
ఎప్‌సెట్ ప్రాథమిక ‘కీ’పై ఈ సారి అభ్యంతరాలు అమాంతం తగ్గిపోయాయి. ఫార్మా అండ్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’పై ఒక్కటంటే ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’పై 42 మాత్రమే వచ్చాయి. నిరుడు రెండు వేల ఆరు అభ్యంతరాలు వచ్చాయి. ఇష్టానుసారంగా అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండటంతో ఈ ఏడాది ఒక ప్రశ్నపై అభ్యంతరానికి రూ. 500 ఫీజుగా విధించారు. దీంతో అభ్యంతరాలు భారీగా తగ్గిపోయాయి. నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టనుండటంతో కొన్ని సెషన్లవారికి మార్కులు కలవనున్నాయి.