హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు (Open School Results) విడుదలయ్యాయి. శనివారం ఈ ఫలితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సారి పదో తరగతిలో 57.60, ఇంటర్మీడియట్లో 59.77శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఏప్రిల్ 20 నుంచి మే 28 వరకు ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరైన వారి ఫలితాలను అధికారులు www.telanganaopenschool.org. వెబ్సైట్లో పొందుపరిచారు.
పదో తరగతిలో 28,547 మంది పరీక్షలు రాయగా, 16,443 (57.80) శాతం ఉత్తీర్ణతసాధించారు. ఇంటర్మీడియట్ కోర్సుల్లో 41.051 మంది పరీక్షలు రాస్తే, 24,538 (59.77శాతం) పాసయ్యారు. 25రోజుల్లో మెమోలను పంపిస్తామని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఇక రెండింటి ఫలితాల్లోను మహిళలే సత్తాచాటారు. మహిళలు పదో తరగతిలో 63.97శాతం, ఇంటర్మీడియట్లో 63.41శాతం పాస్ అయ్యారు. ఇక పురుషులు పదో తరగతిలో 53.24శాతం, ఇంటర్లో 57.49శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు.