OU Exams | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఏదైనా కోర్సుల్లో చేరామంటే.. మిడ్ ఎగ్జామ్స్కో, ఎండ్ సెమిస్టర్ పరీక్షలకో సన్నద్ధమైతే.. ఆన్సర్‌షీట్స్ పేజీలు నింపితే పాసైపోతామని అంతా అనుకొంటారు. పరీక్షల షెడ్యూల్ తెలుసుకొని.. ఓ వారం రోజుల ముందు పుస్తకాలు తిరగేస్తారు. పరీక్షలు రాయడం పాసైపోవడం.. సర్టిఫికెట్లు చేతికందడం ఇది రొటీన్‌గా జరిగే పని. ఇలాంటి మూస విధానానికి ముగింపు పలికేందుకు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకొన్నది. సడెన్‌గా అప్పటికప్పుడే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానంలో అనుకున్నదే తడువుగా ఆచార్యులు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వెంటే ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు. ఈ ఇలాంటి పరీక్షా విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ఓయూ కాన్స్టియంట్ కాలేజీల్లోని పీజీ కోర్సుల్లో అమలుచేయాలని నిర్ణయించినట్టు వీసీ డీ రవీందర్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని వర్సిటీలో అమలుచేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ విధానంలో ప్రాజెక్ట్‌లు, సడన్ ఎగ్జామ్స్, అసెన్‌మెంట్లు, స్లిప్‌టెస్ట్‌లు, బృంద చర్చలుంటాయని, వీటిన్నింటికి గ్రేడ్స్‌ను కేటాయిస్తామని చెప్పారు. ఇక వర్సిటీ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ఈ రెండేండ్ల కాలంలో రూ.144కోట్లు వెచ్చించామని తెలిపారు. సీఎస్సార్ ద్వారా మరో రూ. 20కోట్ల వరకు సమీకరించామని పేర్కొన్నారు.
ఓయూ క్యాంపస్‌లో చదివే విద్యార్థుల కోసం వంద పడకల దవాఖానను మాణికేశ్వర్‌నగర్‌లో నెలకొల్పనున్నట్టు ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. విద్యార్థులు, వర్సిటీ ఫ్యాకల్టీ, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు దవాఖానలో ఉచితంగా మందులు వైద్యసేవలు పొందవచ్చని పేర్కొన్నారు.