హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను అలవర్చేందుకు ఉద్దేశించి ప్రయాస్ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఆసక్తి గల పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎంపికైతే రూ. 50వేలు సొంతం చేసుకోవచ్చు. అయితే నిధులను రీసెర్చ్‌కు, ప్రాజెక్ట్ రూపకల్పనకు వినియోగించుకోవచ్చు. పరిశోధన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ గ్రాంట్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. ‘ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ ఆటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్(ప్రయాస్) అనే కొత్త పథకాన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) తీసుకొచ్చింది. ఈ స్కీం కింద 2025-26 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నుంచి 11 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థి వ్యకిగతంగా లేదా.. బృందంగా పాల్గొనవచ్చు.
విద్యార్థులు స్థానికంగా ఉన్న సమస్యను గుర్తించాలి. ఆయా సమస్యపై ఇన్వెస్టిగేట్ చేయాలి. శాస్త్రీయ పరిష్కారాన్ని చూపాలి. తుది రిపోర్ట్‌ను సమర్పించాలి. విద్యార్థి దశలోనే వారిని స్టార్టర్స్‌గా తయారుచేసేందుకు కేంద్రం ఈ స్కీంను అమలుచేస్తున్నది. విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టేందుకు సమీపంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐసర్ వంటి ఉన్నత విద్యాసంస్థల నిపుణుల సహకారం కూడా లభిస్తుంది. ఆసక్తి గల వారు ఆగస్టు 17లోగా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 15 నుంచి దరఖాస్తులను పరిశీలిస్తారు. సెప్టెంబర్ 30లోపు జ్యూరీ ఎంపికచేస్తుంది. అక్టోబర్ 16 నుంచి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. 20 అక్టోబర్ 2026లోగా ఫైనల్ రిపోర్ట్‌ను సమర్పించాలి. విద్యార్థులు సొంతంగా దరఖాస్తు చేయరాదు. పాఠశాల హెచ్ఎం ప్రయాస్ యోజన వెబ్సైట్లో అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. అయితే ఒక స్కూల్ నుంచి ఒక ప్రాజెక్ట్‌కే ప్రతిపాదనలు సమర్పించాలి. విద్యార్థులకు సైన్స్ టీచర్ మార్గదర్శకత్వం వహిస్తారు. సమీపంలోని ఉన్నత విద్యాసంస్థల సైన్స్ నిపుణుల టెక్నికల్ గైడెన్స్, సహకారాన్ని పొందవచ్చు.