NEET UG | దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (NEET UG) ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నెల 4న దేశవ్యాప్తంగా 552 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. తాజాగా సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్ యూజీ అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. వీటిలో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం వంటి తదితర సమాచారం ఉంటుంది. ఇది హాల్ టికెట్ కాదని, పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని వెల్లడించింది. ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ, చెక్చేసుకోవడంలో కానీ ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థులు 011-40759000/011-69227700 నంబర్లలో లేదా neetug2025@nta.ac.in. ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది.
కాగా, మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య పెన్ను, పేపర్ విధానంలో నీట్ యూజీ పరీక్ష జరుగనుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్ యూజీ 2025 పరీక్ష తొలుత ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే జరపాలని ఎన్టీఏ నిర్ణయించింది. గతేడాది 24 లక్షల మంది అభ్యర్ధులు నీట్ యూజీ రాశారు.