Navodaya Vidyalaya | హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ లాభం లేకుండాపోయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో కొత్తగా ప్రకటించిన నవోదయ విద్యాలయాలను చేర్చలేదు. దీంతో తమ ఏరియాకు వచ్చిన నవోదయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పించాలని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కొత్త నవోదయ విద్యాలయాల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం 2024 డిసెంబర్ 6న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెద్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రకటించింది. అయితే, 2026 సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరో తరగతికి ప్రవేశాల కోసం జూన్ 1, 2025న విడుదలైన నోటిఫికేషన్లో ఈ కొత్తగా ఆమోదించబడిన ఏడు నవోదయ విద్యాలయాలను చేర్చలేదు. ఈ నిర్ణయం పలువురు తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తమ పిల్లలకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న నవోదయలలో చదువుకునే అవకాశం లేకుండా పోతుందనే ఆందోళన వారి మధ్య వ్యక్తమవుతోంది.
“మేము ఎంతో ఆశతో కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించాం. కానీ ఇప్పుడది కేవలం కాగితాలపై ఉన్న ప్రకటనగానే మిగిలిపోయింది. అధికారికంగా విద్యాలయాలను ప్రారంభించి, తాత్కాలిక భవనాల్లో అయినా తరగతులు ప్రారంభించి అడ్మిషన్లు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం,” అని ఓ తండ్రి వేదన వ్యక్తం చేశారు.
స్థాపనకు ఆమోదం వచ్చిన వెంటనే విద్యాసంస్థల నిర్మాణం, అధ్యాపకుల నియామకం వంటి ప్రాథమిక ఏర్పాట్లు చేపట్టి, ఆయా జిల్లాల్లో విద్యార్థులకు తక్షణమే ప్రవేశ అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ ఆమోదం అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును మారుస్తుంది అన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరియు నవోదయ విద్యా సమితి స్పందించి, కొత్తగా ఆమోదించిన నవోదయ విద్యాలయాలను తక్షణం ప్రవేశ ప్రక్రియలో చేర్చాలని విద్యావేత్తలు మరియు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రానంత వరకు వారు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.