Inter Exams | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో సర్కార్ కీలక సంస్కరణలు చేసింది. 80 : 20 విధానానికి శ్రీకారం చుట్టింది. ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది? ఇచ్చే ప్రశ్నలెన్నీ? చాయిస్ ప్రశ్నలుంటాయా? లేదా?. పరీక్ష సమయమెంత అన్న ప్రశ్నలు పీడిస్తున్నాయి.
కేవలం మార్కుల విధానాన్ని మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో క్లారిటీ ఇవ్వాలని విద్యార్థి, అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభంకానున్నాయి. మారిన పరీక్ష విధానంపై విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలి. ఆలస్యమైతే విద్యార్థులు అలవాటు పడటం కష్టం. ఈ నేపథ్యంలో మాదిరి ప్రశ్నపత్రాలను విడుదల చేయాలని అధ్యాపక సంఘాల నేతలు కోరుతున్నారు. ఆరా తీసేందుకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా, ఆమె స్పందించలేదు.