హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 1,931 మల్టీపర్సప్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ-ఫీమేల్) పోస్టుల పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం విడుదల చేసింది. ఈ పోస్టులకు 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20,600 మంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షకు హాజరైనట్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వెయిటేజీ మార్కులను 30నుంచి 20కి పరిమితం చేసినట్టు పేర్కొన్నది.
అభ్యర్థుల సీబీటీ మార్కులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజీ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేశామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 18 నుంచి 22 సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించింది. అవసరమైన అన్ని పత్రాలను ఒకే పీడీఎఫ్‌గా చేసి అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. మొత్తం పోస్టుల్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,666,వైద్య విధాన పరిషత్ పరిధిలో 265 పోస్టులు ఉన్నాయి.