జాగ్రఫీ ఎలా చదవాలి?
పోటీ పరీక్షల కోసం జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చదువుతున్నప్పుడు సాధ్యమైనంతవరకు ఏదైనా అట్లాస్ చూస్తూ చదివితే ఆ విషయాలు చాలాకాలం గుర్తుంటాయి. ఉదా: రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన అంశాలు అంటే గోదావరి నదిపై ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు, వాటి ఉపనదులు మొదలైన అంశాలు అట్లాస్‌లో చూస్తూ చదివితే చాలాకాలం గుర్తుంటాయి.
ఏదైనా జాగ్రఫీకి సంబంధించిన అంశం ఎక్కువ కాలం గుర్తుండాలంటే వాటిని మ్యాప్‌లో గుర్తించడం చాలా ముఖ్యం. ఉదా: గోదావరి నది రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది, ఏయే జిల్లాల గుండా ప్రవహిస్తుంది, ఈ నదికి సంబంధించిన ఏయే ప్రాజెక్టులు, ఏయే జిల్లాల్లో నిర్మించారు వంటి అంశాలు మ్యాప్‌లో గుర్తిస్తూ చదివితే తేలికగా, ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి వీలుంటుంది.
ఇటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీలైనంతవరకు ప్రభుత్వ, అధికారిక వెబ్సైట్ల నుంచి గ్రహిస్తే కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
సామాజిక ఆర్థిక సర్వే
ప్రభుత్వం విడుదల చేసే సామాజిక ఆర్థిక సర్వేపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఉదా: 2022, జూన్‌లో పరీక్ష నిర్వహిస్తే 2021-22కి సంబంధించిన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేపై అవగాహన కలిగి ఉండాలి.
దీనిని ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి.
ప్రాధాన్యత అంశాలు: ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా పరీక్ష సమయానికి ఆరు నెలల ముందు కాలానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలు అంటే నదీ వివాదాలు, వివాదాస్పద ప్రాజెక్టులు, నూతన రాష్ర్టాల ఏర్పాటు అంశాలు, ఫారెస్ట్ సర్వే, పులుల సర్వే, సరిహద్దు వివాదాలు వంటి తాజా అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అభ్యర్థి కాలానుగుణ సమకాలీన అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడా? లేడా? అని పరీక్షిస్తారు.
పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ప్రాధాన్యం తెలంగాణ జాగ్రఫీకి కూడా ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన పూర్తి అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ఎలా చదవాలి?
రోజుకు ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా సబ్జెక్టుపై ఎంత అవగాహన పెంచుకున్నామనేది ముఖ్యం. ఏదైనా ఒక అంశం ప్రారంభిస్తే అది పూర్తయ్యేంతవరకు ఆ అంశాన్నే చదవాలి. ఒకవేళ ఆ అంశం పెద్దగా అనిపిస్తే దాన్ని 2, 3 భాగాలుగా చేసుకొని చదవాలి. ఉదా: తెలంగాణ మృత్తికలు అనే అంశాన్ని ప్రారంభిస్తే దానిని పూర్తిచేసేవరకు మరో అంశాన్ని ప్రారంభించవద్దు.
శ్రీహరి కాకర్ల
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ అశోక్‌నగర్, హైదరాబాద్ 9133237733