
ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్‌గా పేరుగాంచిన జపాన్ ఈస్ట్ ఆసియాలో ఉన్న దేశం. జపాన్‌లో 5 ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా, నాగసాకిల పై బాంబులు, గత దశాబ్దంలో ఫుకుషిమా భూకంపం వంటి పెను ముప్పులను తట్టుకొని నిలదొక్కుకున్న దేశం. నార్త్ వెస్ట్ పసిఫిక్ రీజియన్‌లో ఉన్న జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్న దేశాల్లో ఒకటి. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 68% (24,979,000 హెక్టార్లు) వరకు అడవులతో ఉంది. సుమారు 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో లైఫ్ స్పాన్ సుమారు 75 సంవత్సరాలు ఉంటుంది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. జీడీపీ ర్యాంక్ ప్రకారం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. బుల్లెట్ ట్రైన్ వంటి అద్భుత ఆవిష్కారాలు ప్రపంచానికి అందించిన కంపెనీల్లో 10% జపాన్‌లోనే ఉన్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో 13వ స్థానంలో ఉంది.
ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్, యంత్ర పరికరాలు, ఉక్కు, ఫెర్రస్ లోహాలు, నౌకలు, రసాయనాలు, వస్ర్తాలు, ప్రాసెస్ ఫుడ్ వంటి ప్రధానమైన పరిశ్రమలు ఉన్నాయి. అగ్రికల్చర్, ఫిషింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం ద్వారా కూడా రెవెన్యూ వస్తుంది. 71% సర్వీసెస్, 27% పరిశ్రమల నుంచి ఆదాయం ఉంటుంది.
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్
‘జపాన్‌లో ఎక్కువ శాతం ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. నేషనల్ యూనివర్సిటీల్లో ఒక పరిమితిలో మాత్రమే విదేశీయులకు అనుమతి ఉంది. ప్రభుత్వంలోని విద్య, సంస్కృతి, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEXT) 2022 నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను జాతీయ విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించాలని యోచిస్తుంది. ట్యూషన్ ఫీజు విషయంలో కూడా విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
జపాన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇక్కడి డిగ్రీకి ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది.
విదేశీ విద్యార్థులకు సహాయపడటానికి స్పెషల్ సపోర్ట్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు.
మల్టీ నేషనల్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాటి శాఖలు అనేక దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. జనాభా తక్కువ, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండటం వల్ల స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌కి అవశ్యకత ఎక్కువ ఉంది. ఇండియా-జపాన్ల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవుతున్నప్పటి నుంచి జపాన్ గురించి భారతీయులు ఆలోచించడం మొదలుపెట్టారు.
సుమారు 3,00,000 మంది విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువ శాతం చైనా, వియత్నాం, కొరియాల నుంచి చదువుకోవడానికి జపాన్‌కు వెళ్తుంటారు. అమెరికా, యూరప్‌తో పోలిస్తే భారతీయుల ఆసక్తి జపాన్‌వైపు తక్కువే. కొన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వం చొరవతో కొంత సంఖ్య పెరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్ల ఎక్కువ ఇష్టం చూపుతున్నారు.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ సోర్స్ ఆధారంగా ప్రపంచంలో తొమ్మిదవ సురక్షితమైన దేశం జపాన్. 13 సంవత్సరాలుగా గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో టాప్ పది దేశాల్లో ఉంది. నేరాల రేటు, అంతర్గత సంఘర్షణలు తక్కువ. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి సేఫ్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం టోక్యో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందింది. సైబర్ సెక్యూరిటీలో మొదటి స్థానంలో, ఆరోగ్య భద్రతలో రెండో స్థానంలో, మౌలిక సదుపాయాల భద్రత, వ్యక్తిగత భద్రతలో నాలుగో స్థానంలో ఉంది.
జపాన్ ఎంబసీ లేదా జపాన్ విద్యారంగ శాఖ నేతృత్వంలో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులను ఆకర్షించే విధంగా రిసెర్చ్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, స్పెషల్ ట్రైనింగ్, జపనీస్ స్టడీస్, టీచర్ ట్రైనింగ్ వంటి వాటిలో అనేక స్కాలర్‌షిప్‌లకు అవకాశం ఉంది (https://www.in.emb-japan.go.jp/Education/japanese_government_scholarships.html).
అమెరికా, యూరప్‌లతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కొంచెం తక్కువే. విదేశీ విద్యార్థులకు చదువుతోపాటు పార్ట్ టైం జాబ్‌కు అనుమతి ఉంది. చదువుతున్న సమయంలో వారానికి 28 గంటల పని చేయవచ్చు. వెకేషన్ టైంలో ఎక్కువ పని చేయవచ్చు. జపాన్‌లో చదవడానికి సంవత్సరానికి ట్యూషన్ ఫీజు సుమారు 5000 డాలర్లు, లివింగ్ ఎక్సపెన్సెస్కి సుమారు 9000 డాలర్లు అవసరం ఉంటుంది.
అమెరికాలోని సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి పేరుగాంచిన మనవారు లేకపోవడంతో జపాన్‌లో చదవాలన్న ఆకాంక్ష అమెరికాలో చదవాలన్నంత బలంగా లేదు.
ప్రధాన నగరాలు
హోక్కైడో, హోన్షు, షికోకు, క్యుషు, ఒకినావా జపాన్‌లోని ప్రధాన ఐదు ద్వీపాలు.
టోక్యో: సుమారు 9.2 మిలియన్ జనాభా గల ఈ నగరం హోన్షు ద్వీపంలో ఉంది. ఇంపీరియల్ ప్యాలెస్, చెర్రీ బ్లాసమ్స్, మ్యూజియం, శిబూయ క్రాసింగ్, మార్కెట్స్, పవిత్ర స్థలాలు ఇక్కడి ఫేమస్ ప్రదేశాలు. ఇక్కడ ఎన్నో నేషనల్, పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, టోక్యో టెక్నాలజీ యూనివర్సిటీ ఉన్నాయి.
ఒసాకా: హోన్షులోని ఒక పెద్ద పోర్ట్ సిటీ, వాణిజ్య కేంద్రం. టోక్యోకి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుల్లెట్ ట్రైన్లో 3 గంటల్లో చేరవచ్చు. ఇక్కడి ఆర్కిటెక్చర్, నైట్ లైఫ్, స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్. ఇక్కడ 16వ శతాబ్దం నాటి షోగునేట్ ఒసాకా కోట ఉంది. సుమియోషి-తైషా జపాన్‌లోని పురాతన షింటో పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
క్యోటో: పేరు వినగానే ైక్లెమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్కి సంబంధించిన క్యోటో ప్రొటోకాల్ గుర్తుకు వస్తుంది. జపాన్ కల్చర్ క్యాపిటల్‌గా పేరుగాంచిన ఈ నగరంలో ఎన్నో బౌద్ధ దేవస్థానాలు, షింటో మందిరాలు, రాజ భవనాలు, అందమైన తోటలు ఉన్నాయి. క్యోటో యూనివర్సిటీ, దోషీషా యూనివర్సిటీ ఉన్నాయి.
ఫుకుయోకా: క్యూషు ప్రాంతంలో ఉన్న ఈ నగరం జపాన్‌లోని రెండో పెద్ద పోర్ట్ సిటీ. ప్రాచీన దేవాలయాలు, షాపింగ్ మాల్స్, బీచ్‌లు, ఫోక్ మ్యూజియం, చెక్కతో చేసిన బుద్ధుని విగ్రహమున్న గుడి చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడి మైజ్రు పార్క్‌లో 17వ శతాబ్దానికి చెందిన ఫుకుయోకా రాజభవనం పర్యాటకులను ఆకర్షిస్తుంది. టోక్యో, ఒసాకాతో పోలిస్తే లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువే. క్యూషు యూనివర్సిటీ, ఫుకుయోకా యూనివర్సిటీ ఉన్నాయి.
సప్పోరో: హొక్కైడోలోని ఈ నగరం స్నో ఫెస్టివల్, స్కీయింగ్‌కి ఫేమస్. ఒకప్పుడు వింటర్ ఒలింపిక్స్ ఇక్కడే జరిగాయి.
జపాన్‌లో ఎన్నో అందమైన నగరాలు ఉన్నాయి. అందులో కొన్ని అర్బన్ లైఫ్‌కి ప్రతీక అయితే, కొన్ని అటువంటి హడావిడికి దూరంగా ఉన్నట్టు ఉంటాయి.
హిరోషిమా సాన్యో ప్రాంతంలో ఉన్న ఎంతో చరిత్ర గల నగరం. ఇక్కడ ఉన్న మియజమా ద్వీపం బాగుంటుంది.
యొకహామా ఎక్కువ జనాభా గల నగరం. నివాస ఖర్చులు తక్కువ. టోక్యోకి త్వరగా చేర్చే ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ వసతులు ఉన్నాయి.
టాప్ యూనివర్సిటీలు
QS ర్యాంకింగ్స్ ప్రకారం జపాన్‌లోని 38 యూనివర్సిటీలు ప్రపంచంలో పేరు పొందిన యూనివర్సిటీల్లో ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ టోక్యో: గ్లోబల్ ర్యాంకింగ్ 24తో జపాన్‌లోని టాప్ యూనివర్సిటీల్లో మొదటి స్థానంలో ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, మెకానికల్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఎంతో పేరు గడించింది. 1877లో ప్రారంభించిన ఈ విశ్వ విద్యాలయం ఒక పబ్లిక్ రిసెర్చ్ యూనివర్సిటీ. లా, సైన్స్, మెడిసిన్, లిటరేచర్ వంటి అనేక డిపార్ట్మెంట్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ చదివిన వారిలో అనేకమంది ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. దేశ ప్రధాన మంత్రుల్లో 16 మంది ఇక్కడ చదివినవారే. ఇక్కడి పూర్వ విద్యార్థుల్లో సైన్స్, లిటరేచర్, శాంతి రంగాల్లో నోబెల్ అందుకున్నవారు కూడా ఉన్నారు. సుమారు 30,000 మంది చదివే ఇక్కడ 3000 మంది విదేశీ విద్యార్థులున్నారు. దీనికి 5 క్యాంపస్‌లు ఉన్నాయి. అవి.. హాంగో క్యాంపస్, కొమాబా క్యాంపస్, కాశివా క్యాంపస్, షిరోకనేడై క్యాంపస్, నకనో క్యాంపస్. గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో అడ్మిషన్ కోసం టెస్ట్ రాయాలి. కొన్ని కోర్సులు ఇంగ్లిష్‌లో ఉంటాయి. కొన్నిటికి జపాన్ నేర్చుకోవడం అవసరం.
క్యోటో యూనివర్సిటీ: జపాన్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక్కడి సుమారు 35 కోర్సులు బెస్ట్ కోర్సుల జాబితాలో ఉన్నాయి. బయోలాజికల్ సైన్స్, కెమికల్, సివిల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్సెస్, మోడరన్ లాంగ్వేజ్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ వంటి సబ్జెక్టులు పేరుగాంచాయి. 1897లో ప్రారంభించిన ఈ యూనివర్సిటీ జపాన్‌లోని ఓల్డెస్ట్ యూనివర్సిటీల్లో ఒకటి. స్కాలర్షిప్, నివాస వసతులు ఉన్నాయి. అడ్మిషన్‌కి ముందు అడ్మిషన్స్ ఆఫీస్‌ని సంప్రదించవచ్చు.
ఒసాకా యూనివర్సిటీ: లేటెస్ట్ ర్యాం కింగ్స్‌లో 75వ స్థా నంలో ఉంది. సుమారు 27 సబ్జెక్టులు ఎంతో గుర్తిం పు పొందాయి. కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, డెంటిస్ట్రీ, మెటీరియల్ సైన్సెస్ వాటికి ఎక్కువ గుర్తింపు ఉంది. ఈ నేషనల్ యూనివర్సిటీని 1724లో ప్రారంభించారు.
టో హొకు: 1736లో మొదట మెడికల్ స్కూల్‌గా ప్రారంభమై ఆ తరువాత యూనివర్సిటీగా మారింది. సుమారు 1500 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏటా ఇక్కడ చదువుకుంటారు. అడ్మిషన్స్‌కి ముం దు ఒక కోర్స్ సూపర్వైజర్ని సంప్రదించాలి.
హోక్కైడో యూనివర్సిటీ, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇతర ప్రముఖ కాలేజీలు.
స్ప్రింగ్ ఆటమ్ లేదా స్ప్రింగ్ సమ్మర్, ఆటమ్ అడ్మిషన్ ఇన్‌టేక్ ఉంటుంది.
అడ్మిషన్స్ కోసం రాయాల్సిన పరీక్షలు, ఇంగ్లిష్ లేదా జపాన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యతను అవసరముంటే నిరూపించుకోవాలి. అడ్మిషన్ వచ్చిన తరువాత స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇమ్మిగ్రేషన్ పర్మిషన్ పార్ట్ టైంగా వర్క్ చేయడానికి అవసరం.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT