JEE Advanced | దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 (JEE Advanced) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. జూన్ 2న ఉదయం 10 గంటలకు తుది కీతోపాటు ఫలితాలను ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) విడుదల చేయనుంది. మే 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.80 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తున్నది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గత ఏడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://jeeadv.ac.in/లో ఫలితాలు చూడవచ్చు. ఇప్పటికే అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్‌ను మే 22న, ప్రొవిజినల్ ఆన్సర్ కీని మే 26న విడుదల చేసిన విషయం తెలిసిందే.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ 2025) పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జూన్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఐఐటీ కాన్పూర్ స్పష్టం చేసింది. కాగా, జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్ (Josaa Counselling) ప్రారంభం కానుంది. ఈసారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐఐటీ కాన్పుర్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
6 విడతల్లో జోసా కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్ జరగనుంది. గత ఏడాది ఐదు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా రెండు సార్లు మాక్ సీట్ అలాట్మెంట్ నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు రావచ్చు. ఈసారి మొత్తం 127 విద్యాసంస్థల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. గత ఏడాది జోసా కింద 121 విద్యాసంస్థలుండగా ఈసారి కొత్తగా మరో 6 సంస్థలు చేర్చారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలే కావడం గమనార్హం. దీంతో ఆ సంఖ్య 127కి చేరింది. మొత్తంగా ఈ సారి 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 46 జీఎఫ్‌టీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..