క్యాట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో 9 మంది అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి. ఇలా ఫుల్ మార్కులు సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థి కూడా ఉన్నారు.
నూటికి నూరు మార్కులు వచ్చిన 9 మందిలో నలుగురు మహారాష్ట్ర వారు కాగా, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. హర్యానా, తెలంగాణ, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరికి వంద శాతం మార్కులు దక్కాయి. ఈసారి క్యాట్-2021 పరీక్షను 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు రాశారు.
దేశవ్యాప్తంగా 156 పట్టణాల్లో 438 పరీక్షాకేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షలో పాసయిన అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సన్ ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఈ రౌండ్స్ కూడా పూర్తయిన తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుంది.