(Vinod Kumar) హైదరాబాద్: జాతీయ విద్యావిధానంపై రాష్ట్రాలకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆ పాలసీని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటే తప్పనిసరిగా స్పష్టత రావాలని చెప్పారు. ఆదివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జాతీయ స్థాయి ఎడ్యు ఎక్స్‌ను వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఈపీపై అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పలు అంశాలపై తాను సవరణలు సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ పట్టించుకున్నవారు కరవయ్యారని, స్పష్టత ఇచ్చేవారే లేరని దుయ్యబట్టారు.
కరోనా కారణంగా అన్ని రంగాలతోపాటు విద్యా రంగానికి కూడా తీరని నష్టం వాటిల్లిందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 2022-23 సంవత్సరాన్ని అభ్యాసన నష్టాన్ని పూడ్చే ఏడాదిగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రానున్న కాలంలో జనాభా సంఖ్య పెద్ద ఎత్తున పెరగనున్న నేపథ్యంలో మరిన్ని ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఎడ్యు ఎక్స్‌లో విద్యా రంగ అంశాలపై విపులంగా చర్చించి సమగ్రమైన నివేదికను అందజేయాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై శేఖర్ రావుకు సూచించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తొలుత ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వై శేఖర్ రావు స్వాగతోపన్యాసం చేయగా.. ప్రధాన కార్యదర్శి మధుసూదన్ నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు, కో- కన్వీనర్లు ఐవీ రమణా రావు, శ్రీకాంత్ రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.