AP ICET Counselling | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 4వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. దాదాపు నెల పాటు వాయిదా పడింది.
ఐసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్ జూలై 28వ తేదీనే పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 13,352 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 33 వేల సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లకు ఆగస్టు 4వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణకు ఏపీ ఉన్నత విద్యామండలి అనుమతినిచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
ఇవాల్టి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 9వ తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇస్తారు. 11వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో 11వ తేదీ నుంచి 13 వతేదీ మధ్యలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.