AP EAPCET | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు కన్వీనర్ కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. సీబీఎస్ఈ రీవెరిఫికేషన్/రీ వాల్యుయేషన్ ప్రక్రియ మార్కులు పెరిగిన విద్యార్థులు తప్పనిసరిగా సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్ డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేయాలని సూచించింది.
ఎప్‌సెట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఈ డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాలని సీబీఎస్ఈ విద్యార్థులకు అధికారులు సూచించారు. సంబంధిత విద్యార్థులు జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ డిక్లరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సమర్పించాలని ఎప్‌సెట్ కన్వీనర్ ఎన్.మోహన్ రావు తెలిపారు. నిర్ణీత గడువులోగా డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించి, కౌన్సెలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నాటికే ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంటర్ సెకండియర్ విద్యార్థులు మార్కులు పెంచుకునేందుకు వీలుగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసే అవకాశం కల్పించడం, సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్ వ్యవహారం నేపథ్యంలో ఎప్‌సెట్ ఫలితాల విడుదలను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్/రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలవ్వడంతో ఈ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.