జాతీయం
పీఏసీ
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ-ప్రజా పద్దుల సంఘం) శతవార్షికోత్సవాలను ఢిల్లీలో డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్న ఈ వేడుకలకు పాకిస్థాన్‌తో సహా 52 దేశాలను ఆహ్వానించారు. పీఏసీని 1921లో ఏర్పాటు చేశారు. మూడు ఆర్థిక పార్లమెంటరీ కమిటీల్లో పీఏసీ ఒకటి. మిగిలిన రెండు కమిటీలు.. అంచనాల కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ. ఈ కమిటీలోని 22 మంది సభ్యుల్లో 15 మందిని లోక్‌సభ స్పీకర్, 7 మందిని రాజ్యసభ స్పీకర్ నియమిస్తారు. దీనికి చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు. ప్రస్తుతం దీనికి చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యవహరిస్తున్నారు.
పుస్తకావిష్కరణలు
‘ది మిడ్ వే బ్యాటిల్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో డిసెంబర్ 4న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని గౌతమ్ చింతామణి రచించారు.‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్: ఏ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబర్ 5న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రభాత్ కుమార్ రచించారు. ఈయన గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు.
సంధాయక్
భారత నావికాదళం సర్వే కోసం రూపొందించిన నాలుగు అతిపెద్ద నౌకల్లో ఒకటి అయిన ‘సంధాయక్’ను డిసెంబర్ 5న ప్రారంభించారు. ఇండియన్ షిప్ బిల్డర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ వీటిని రూపొందిస్తుంది.
జ్ఞాన్‌పీఠ్ పురస్కారం
ఇద్దరు రచయితలకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారాలను డిసెంబర్ 8న ప్రకటించారు. 56వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును అస్సామీ రచయిత నీల్మణి పుకాన్, 57వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును కొంకణి రచయిత దామోదర్ మౌజోలకు లభించింది. సాహిత్య పరంగా దేశంలో అత్యున్నత అవార్డు అయిన జ్ఞాన్‌పీఠ్‌ను 1965లో స్థాపించారు. ఈ అవార్డు కింద రూ.13 లక్షల నగదును అందజేస్తారు.
పవర్ కపుల్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ) ‘పవర్ కపుల్’ పేరుతో ఓ జాబితాను డిసెంబర్ 9న విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మొదటి స్థానంలో నిలిచారు. రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణె 2, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ 3, రణ్‌బీర్ కపూర్-అలియా భట్ 4, అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా 5, షారుఖ్ ఖాన్-గౌరీ ఖాన్ 6, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ 7, అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ 8, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ 9, నారాయణ్-సుధామూర్తి 10వ స్థానాల్లో నిలిచారు.
పుస్తకావిష్కరణ
‘ఎట్ హోమ్ ఇన్ ది యూనివర్స్’ పుస్తకాన్ని డిసెంబర్ 9న విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని మహారాష్ట్ర రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలకృష్ణ మాథుర్ రాశారు. ఆయన డీహెచ్ఎఫ్ఎల్ ప్రాపర్టీ సర్వీసెస్ లిమిటెడ్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించారు.
బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎయిర్ వెర్షన్‌ను డిసెంబర్ 8న విజయవంతంగా ప్రయోగించారు. దీనిని ఒడిశా తీరంలోని చాందీపూర్ సమీకృత ప్రయోగ కేంద్రంలో సుఖోయ్-30 ఎంకే1 నుంచి పరీక్షించారు. దీని పరిధి 400 కిలోమీటర్లు.
అంతర్జాతీయం
ఫోర్బ్స్ పువర్ఫుల్ ఉమన్
ఫోర్బ్స్ 18వ ఎడిషన్ ప్రపంచ అత్యంత 100 మంది పవర్ఫుల్ ఉమన్ జాబితాను డిసెంబర్ 7న విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా రచయిత్రి మెకంజీ స్కాట్ మొదటి స్థానంలో నిలువగా కమలా హ్యారిస్ 2, క్రిస్టీన్ లగార్డే 3, మ్యారీ బర్రా 4, మిలిండా గేట్స్ 5వ స్థానాల్లో నిలిచారు.ఈ జాబితాలో భారత్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 37, హెచ్‌సీఎల్ సీఈవో రోష్నీ నాడార్ 52, బయెకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 72, సౌందర్య సాధనాల ఈ-కామర్స్ సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో ఉన్నారు.
అంతరిక్ష యాత్ర
రష్యా సహకారంతో కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి జపాన్ కుబేరులు అంతరిక్ష యాత్రకు జపాన్ కుబేరులు డిసెంబర్ 8న బయలుదేరి వెళ్లారు. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్తో పాటు జపాన్ కుబేరులు యసాకు మీజవా, యోజో హిరనో 12 రోజులు పాటు అంతరిక్షంలో గడపనున్నారు.
పవర్ ఇండెక్స్
ఆసియా దేశాల అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితా పవర్ ఇండెక్స్‌ను లోవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆసియా డిసెంబర్ 8న విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలువగా.. చైనా 2, జపాన్ 3, భారత్ 4, రష్యా 5వ స్థానాల్లో నిలిచాయి. లోవి ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం సిడ్నీలో ఉంది.
ఎకువేరిన్-21
భారత్-మాల్దీవుల మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఎకువేరిన్-21’ పేరుతో డిసెంబర్ 8న నిర్వహించారు. ఉగ్రవాదం నిర్మూలన, ఇరుదేశాల మధ్య సైనిక స్నేహ సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మాల్దీవుల్లోని కద్ధూ ద్వీపంలో ఈ వ్యాయామం చేపట్టారు. ఎకువేరియన్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం.
ఐఎస్ఏకి యూఎన్జీఏ హోదాఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ)కి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ-యూఎన్జీఏ) పరిశీలక హోదాను మంజూరు చేశామని యూఎన్జీఏ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ డిసెంబర్ 10న ప్రకటించారు. ఈ ఐఎస్ఏ కాప్-21 సదస్సులో భారత్-ఫ్రాన్స్‌లు ఆరేండ్ల క్రితం ఏర్పాటు చేశాయి.
వార్తల్లో వ్యక్తులు
అడమా బరో
గాంబియా దేశానికి అధ్యక్షుడిగా అడమా బరో డిసెంబర్ 6న ఎన్నికయ్యారు. ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 53 శాతం ఓట్లు ఆయనకు లభించాయి.
అన్విత
రష్యాలో అతి ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని పడమటి అన్విత డిసెంబర్ 7న అధిరోహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎర్రంబల్లి గ్రామానికి చెందిన ఆమె భువనగిరి ఖిల్లా వద్ద ఉన్న రాక్ ైక్లెంబింగ్ స్కూల్లో కోచ్‌గా పనిచేస్తున్నారు. ఈ పర్వతం ఎత్తు 18,510 అడుగులు (5,642 మీటర్లు).
అనిల్ మీనన్
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్-ఎన్ఏఎస్ఏ)లో వ్యోమగామిగా భారత సంతతికి చెందిన డాక్టర్ అనిల్ మీనన్ ఎంపికయ్యారు. మొత్తం 12 వేల మంది దరఖాస్తుల్లో అనిల్‌తో పాటు మరో 9 మందిని ఎంపిక చేశామని నాసా ప్రెసిడెంట్ బిల్ నెల్సన్ డిసెంబర్ 7న ప్రకటించారు. ఆయన ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్‌గా పనిచేస్తున్నారు.
రూపేష్ గోయల్
ఐఐటీ కాన్పూర్ సైంటిస్ట్ రూపేష్ గోయల్‌కు యంగ్ జియో స్పేషియల్ సైంటిస్ట్ అవార్డు లభించింది. జియో స్పేషియల్ వరల్డ్ హైదరాబాద్‌లో డిసెంబర్ 7న నిర్వహించిన డిజిస్మార్ట్ ఇండియా-2021 సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందజేశారు.
శ్రీకాంత్ మాధవ్ వైద్య
వరల్డ్ ఎల్పీజీ అసోసియేషన్ (వరల్డ్ఎల్పీజీఏ) ప్రెసిడెంట్‌గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్యను ఎన్నుకున్నామని డబ్ల్యూఎల్‌పీజీఏ డిసెంబర్ 7న ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయంలో ఫ్రాన్స్‌లో ఉంది. దాదాపు 125 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
నీలి
అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా తెలుగు మహిళ నీలి బెండపూడి ఎన్నికయ్యారు. పెన్సిల్వేనియా స్టేట్ బోర్డు ట్రస్టీలు తదుపరి అధ్యక్షురాలిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వర్సిటీ డిసెంబర్ 8న ప్రకటించింది. 166 ఏండ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన తొలి మహిళ గానూ ఆమె రికార్డ్ సాధించారు. ప్రస్తుతం ఆమె కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఒలాఫ్ షోల్జ్జర్మనీ నూతన చాన్స్‌లర్‌గా సోషల్ డెమొక్రాట్ పార్టీ నాయకుడు ఒలాఫ్ షోల్జ్ డిసెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. 707 మంది సభ్యులు ఉన్న దిగువ సభలో ఆయనకు 395 ఓట్లు లభించాయి.
క్రీడలు
అక్సెల్సన్, తై జు యింగ్
వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ 2021కు గాను ఉత్తమ క్రీడాకారులను డిసెంబర్ 3న ప్రకటించింది. పురుషుల్లో ఉత్తమ క్రీడాకారుడిగా విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), మహిళల్లో ఉత్తమ క్రీడాకారిణిగా తై జు యింగ్ (తైవాన్)లను ఎంపిక చేసింది.
హామిల్టన్
ఫార్ములావన్ (ఎఫ్1) సౌదీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. డిసెంబర్ 6న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2 గంటల 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించి విజయం సాధించాడు. వెర్స్టాపెన్ (బెల్జియం) 2, వారల్టేర్ బొటాస్ 3వ స్థానాల్లో నిలిచారు.
సాబ్రి
మొదటి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబీసీ) ఇండియా టైటిల్‌ను చెన్నైకి చెందిన సాబ్రి గెలుచుకున్నాడు. డిసెంబర్ 7న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ సింగ్‌పై విజయం సాధించాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులుఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్