హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లకు ఎట్టకేలకు వేతనాల విడుదలకు మార్గం సుగమమయ్యింది. వీరికి వేతనాలు చెల్లించేందుకు వీలుగా విద్యాశాఖ సోమవారం రూ. 51.19కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. 2008 డీఎస్సీ బాధిత టీచర్లకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించింది. 1,225 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)లుగా ఉద్యోగాలు కల్పించారు. వీరికి నెలకు రూ. 31,040 వేతనం ఖరారుచేశారు. ఫిబ్రవరిలో వీరికి బడుల్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కు సంబంధించిన వేతనాలు ఇవ్వలేదు.
అంటే ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. ఏప్రిల్ 24తో బడులు మూతపడగా, వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వేతనాలు అందని విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. జూన్ 12 నుంచి వీరిని విధుల్లోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో విద్యాశాఖ తాజాగా బడ్జెట్ను విడుదల చేసింది. వీరిలో కొందరికి ఇప్పటి వరకు ఎంప్లాయిస్ ఐడీలు కూడా కేటాయించలేదు. టీచర్ల అకౌంట్ నంబర్లు, పాన్ నంబర్లు తీసుకోలేదు. జీతాల డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి బడ్జెట్ను విడుదల చేసినా ఖాతాల్లో జమచేసేందుకు మరికొంత కాలం పట్టే అవకాశముంది.