
ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల అభ్యర్థులు మెరుగైన స్థాయిలో రాణించారు. వారు త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర సర్వీసుల్లో దేశానికి సేవలు అందించనున్నారు. దేశంలో అత్యంత ఉన్నతమైనదిగా భావించే సివిల్స్ పరీక్ష.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా మూడు దశల్లో జరుగుతుంది. మొదటి రెండు దశల్లో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. అభ్యర్థిని విజేతల జాబితాలో నిలిపే అతి ముఖ్యమైన దశ ఈ ఇంటర్వ్యూ. అప్పటి వరకు సబ్జెక్ట్ సంబంధిత పరిజ్ఞానంతో ఈ దశకు చేరుకున్న అభ్యర్థుల తార్కిక పరిజ్ఞానాన్ని, వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు. 275 మార్కులకు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం మార్కుల్లో ఇక్కడ సాధించే మార్కులే విజయాన్ని నిర్దేశిస్తాయి. ఈసారి ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా సాగింది. బోర్డు సభ్యుల నుంచి అభ్యర్థులు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు? ప్రశ్నల సరళి ఎలా ఉందో? స్థూలంగా విశ్లేషిస్తూ, భవిష్యత్తులో సివిల్స్ రాయాలనుకునే వారికి ఓ అవగాహన కల్పించే వ్యాసం ఇది.
ఇంటర్వ్యూ బోర్డు వేసే ప్రశ్నలకు ప్రధాన ఆధారం, అభ్యర్థి, యూపీఎస్సీకి సమర్పించే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF). అభ్యర్థి పేరు మొదలుకుని తన కుటుంబ నేపథ్యం, ప్రాంతం, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, యూపీఎస్సీ కోసం ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ ఇలా అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. దాదాపుగా ప్రశ్నలు ఇందులో నుంచే మొదలవుతాయి. అక్కడి నుంచి అనుబంధ ప్రశ్నలు, ఆయా అంశాలతో ముడిపడి ఉన్న వర్తమాన అంశాల వరకు విస్తరిస్తాయి. ఈ ప్రశ్నలను ఎదుర్కొనే క్రమంలో అభ్యర్థి హావభావాలు, భావ వ్యక్తీకరణ, మానసిక, మేధో సామర్థ్యం ఎలా ఉన్నాయనే దానిని బట్టి, ఇంటర్వ్యూ ముగిసేలోగా బోర్డు సభ్యులు ఒక అంచనాకు వస్తారు. దానికి అనుగుణంగా మార్కులు కేటాయిస్తారు.
ఆహ్లాదకరంగా సాగింది
దాదాపు 40 మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ విధానాన్ని విశ్లేషించిన తర్వాత రాస్తున్న వ్యాసం ఇది. సాధారణంగా గమనించిందేమిటంటే.. దాదాపు ప్రతి అభ్యర్థి బోర్డు ముందు కూర్చోగానే సంబంధిత బోర్డు చైర్మన్, అభ్యర్థి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌ని గట్టిగా చదివి వినిపించారు. ఆ తర్వాత పశ్నలు మొదలుపెట్టారు. కొందరు అభ్యర్థులను వారి ఇంటి పేరుకి అర్థమేంటో చెప్పమన్నారు. ఇంకొందరిని వారి పేరు అర్థమేంటని అడిగారు. పేరు పెద్దగా ఉన్నప్పుడు, మిత్రులు ఎలా పిలుస్తారని సరదా ప్రశ్నలు వేశారు. అలాగే కొందరిని కుటుంబ నేపథ్యం గురించి కూడా అడిగారు. సాంకేతికంగా చూస్తే బోర్డు ఇలాంటి సాధారణ ప్రశ్నల ద్వారా ఇంటర్వ్యూ మొదలుపెట్టి అభ్యర్థి అక్కడి వాతావరణంలో ఒదిగిపోయేలా స్నేహపూర్వకంగా వ్యవహరించింది. ఇది అభ్యర్థికి కొండంత బలాన్ని ఇస్తుంది.
ప్రాంతం.. పరిస్థితులు
ఐఏఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థి తన ప్రాంతం గురించి కనీస అవగాహన కలిగి ఉండాలని యూపీఎస్సీ ఆశిస్తుంది. తెనాలి ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థిని తెనాలి రామకృష్ణ గురించి అడిగారు. పాఠ్యపుస్తకాల్లో రామకృష్ణ కంటే బీర్బల్‌కు ఎక్కువ ప్రాచుర్యం లభించింది. దీనిపై మీరేమంటారు అని అడిగారు. అప్పుడు పాఠ్యపుస్తకాలపై చర్చ జరిగి అది కాస్తా ఇటీవల తీసుకువచ్చిన విద్యా విధానం వైపు మళ్లింది. మరో అభ్యర్థి సొంత ప్రాంతం చీరాల కావడంతో చీరాల దేనికి ప్రత్యేకం అని అడిగారు? టెక్స్‌టైల్స్‌కు ప్రసిద్ధి అని జవాబు చెప్పాడు. అప్పుడు బోర్డు సభ్యుడు చొరవ తీసుకుని జీడిపప్పునకు కూడా ప్రత్యేకం అని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు, పోలవరం ప్రాజెక్ట్, కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ అంశం ఇలాంటి ప్రశ్నలు అడిగారు. వరంగల్ నుంచి ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థిని వరంగల్ ఇటీవల వార్తల్లో ఎందుకు ఉందో చెప్పమన్నారు. యునెస్కో ఒక ప్రాంతాన్ని వారసత్వ ప్రదేశంగా ఎలా గుర్తిస్తుంది? అని అడిగారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అభ్యర్థి తన ప్రాంతంపై అవగాహన కలిగి ఉండటం అవశ్యం.
సూటు బూటు గురించి మాట్లాడుతూనే..!
ఇంటర్వ్యూకి వెళ్లిన వ్యక్తికి చక్కటి వస్త్రధారణ అవసరం అని అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఇంటర్వ్యూ బోర్డు ఆ డ్రెస్సింగ్ నుంచే వ్యక్తులను డీ కోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. చక్కటి వస్త్రధారణతో వెళ్లిన ఒక అభ్యర్థిని బోర్డు అభినందించింది. మరో అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలు డ్రెస్సింగ్ నుంచే మొదలయ్యాయి.
మీరు వేసుకున్న బూట్లు లెదర్‌తో చేసినవా?
చెన్నై కాకుండా భారత్‌లో ఇంకా ఎక్కడెక్కడ లెదర్ ఇండస్ట్రీ విస్తరించి ఉంది?
చెన్నై ప్రధాన లెదర్ ఉత్పత్తిదారు కావడానికి కారణం ఏమిటి? ఇలా ప్రశ్నల సరళి సాగింది. ఆ తర్వాత అభ్యర్థి సూటుపైకి మారింది. భారత్‌లో టెక్స్టైల్ ఉత్పత్తికి సంబంధించి ప్రధాన ప్రాంతాలు ఏవి? అంటూ ప్రశ్నలు సంధిస్తూ వెళ్లారు.
అభిరుచులు.. ఆసక్తులపై
డీటెయిల్డ్ అప్లికేషన్లో ప్రతి అభ్యర్థి తన అభిరుచులు, ఆసక్తులు తెలియజేయాలి. ఒక అభ్యర్థి హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ తన హాబీగా పేర్కొన్నాడు. బోర్డు తనని అడిగిన ప్రశ్నలు
ఆప్షనల్ సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు
మెయిన్ ఎగ్జామ్‌లో కీలక పాత్ర వహించే ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంటర్వ్యూలో కూడా కీలకమే. ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థుల్లో దాదాపు అందరినీ సంబంధిత ఆప్షనల్ నుంచి ప్రశ్నలు అడిగారు.
పొలిటికల్ సైన్స్ ఆప్షనల్లో కొన్ని ప్రశ్నలు
నేషన్‌కు, స్టేట్‌కు తేడా ఏంటి?
అఫ్గాన్‌లో తాలిబన్ తిరుగుబాటు?
ప్రజాస్వామ్యం లక్షణాలు ఏంటి?
ఇటీవల ప్రజాస్వామ్య దేశంగా మారిన పొరుగు దేశం ఏది?
ఆంత్రోపాలజీ ఆప్షనల్తో పరీక్ష రాసిన అభ్యర్థికి ఎదురైన కొన్ని ప్రశ్నలు
ఆంత్రోపాలజీ ఆప్షనల్ ఎందుకు ఎంచుకున్నారు?
డార్విన్ సిద్ధాంతాల గురించి, సోషియాలజీ, ఆంత్రోపాలజీ మధ్య వైరుధ్యం ఏమిటి?
మానవ పరిణామక్రమం మరో 1000-2000 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది?
కెమిస్ట్రీ ఆప్షనల్లో కొన్ని ప్రశ్నలు
సిలికాన్ కంటే కార్బన్లో సమ్మేళనాలు ఎందుకు ఎక్కువ?
జీనోమ్ సీక్వెన్సింగ్ ఇలా ప్రశ్నలు వచ్చాయి.
గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏ ఆప్షనల్తో పరీక్ష రాసినా సరే ఇంటర్వ్యూలో కూడా దాని నుంచి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వర్తమానఅంశాలపై చర్చ
ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరవుతున్న రోజు యూఎన్ఎస్సీ (United Nations Security Council) సమావేశం ఉంది. కాబట్టి ఆ సమావేశ ఎజెండా ఏమిటో చెప్పమన్నారు.
అసలు యూఎన్ఎస్సీ ఔచిత్యం ఉందా? ఉంటే ఏమిటి?
లేకుంటే ఎందుకు ఔచిత్యాన్ని కోల్పోయింది?
ఎఫ్సీఆర్ఏ (Foreign contribution regulation Act)కు ఇటీవల చేసిన మార్పులు ఏమిటి?
కులాలవారీగా జనాభా లెక్కింపుపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలా?
ఇటీవలి కాలంలో వరదల పెరుగుదలకు కారణం ఏమిటి?
ఈ ప్రశ్నల సరళి గమనిస్తే అర్థమైంది ఏమిటంటే సమకాలీన ప్రపంచ వ్యవహారాలపై అవగాహన ఉండటం తప్పనిసరి అని.
ఉద్యోగానుభవంపై ప్రశ్నలు

మల్లవరపు బాలలత ,సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ ,హైదరాబాద్