
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం విడుదలైన ఫలితాల విశ్లేషణ భవిష్యత్ అభ్యర్థుల స్ట్రాటజీకి ఎంతో ఉపయోగపడుతాయి. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిద్దాం…
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,51,193 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో అడ్వాన్స్డ్ పరీక్ష రెండు పేపర్లు రాసిన వారి సంఖ్య 1,41,699. అడ్వాన్స్డ్ పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ను సాధించి అర్హత పొందిన వారు 41,862 మంది.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన బాలురు 1,16,672 మంది. వీరిలో అర్హత సాధించినవారు 35,410 మంది. బాలికలు 34,520 మంది పరీక్ష రాస్తే కేవలం 6452 మంది మాత్రమే అర్హత సాధించారు. ట్రాన్స్‌జెండర్ ఒక్కరే పరీక్ష రాశారు. కానీ అర్హత సాధించలేదు. పీహెచ్సీ అభ్యర్థులు 1418 మంది పరీక్ష రాసిన వారు 375 మంది.
జేఈఈ అడ్వాన్స్డ్-2021 పరీక్ష 360 మార్కులకు నిర్వహించారు. పేపర్-1 180, పేపర్-2 180 మార్కులు.
సబ్జెక్టుల వారీగా ఫిజిక్స్- 120, కెమిస్ట్రీ- 120, మ్యాథ్స్- 120 మార్కులు కేటాయించారు.
జేఈఈ అడ్వాన్స్డ్-2021 ర్యాంకులకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే..
రాజస్థాన్‌కు చెందిన మృదుల్ అగర్వాల్ ప్రథమ ర్యాంకు సాధించాడు. అతడికి 360 మార్కులకు 348 వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్ మార్కుల్లో ఇదే రికార్డు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని మృదుల్ తెలిపాడు. బాలికల్లో కావ్యా చోప్రా ప్రథమ ర్యాంకు సాధించింది. ఢిల్లీ జోన్‌కు చెందిన ఆమెకు 360 మార్కులకు 286 వచ్చాయి. ఓవరాల్‌గా ఆమెకు 98వ ర్యాంకు లభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈ ఏడాది మొత్తం 41,862 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది బాలికలు. మొదటి 100 ర్యాంకుల్లో ఐఐటీ బాంబే జోన్‌కు 28, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు 28 ర్యాంకులు దక్కాయి. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కి 27, ఐఐటీ రూర్కీ జోన్‌కి 13, ఐఐటీ కాన్పూర్ జోన్‌కి 3, ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్‌కి ఒక ర్యాంకు లభించింది.
4 విభాగాల్లో హైదరాబాద్ జోన్‌కే టాప్ ర్యాంకులు
జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ 500 ర్యాంకుల్లో ఐఐటీ బాంబే తర్వాత హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులే ఎక్కువ ఉండటం విశేషం. హైదరాబాద్ ఐఐటీ జోన్ నుంచి నందిగామ నిఖిల్ ఎస్సీ కోటా, బిజిలి ప్రచోతన్ వర్మ ఎస్టీ, గొర్లె కృష్ణచైతన్య ఓబీసీ (వికలాంగ) కోటాలో జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచారు. బాంబే ఐఐటీ జోన్ నుంచి 137 మంది టాప్-500లో ఉండగా, హైదరాబాద్ జోన్ నుంచి 135 విద్యార్థులు ర్యాంకులు సాధించారు. బాలికల విభాగంలో హైదరాబాద్ జోన్లో టాపర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పల్లె భావన నిలిచింది. భావన జాతీయ స్థాయిలో 107వ ర్యాంక్ సొంతం చేసుకోగా, మహిళల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది.
హైదరాబాద్ జోన్ పరిధిలో ర్యాంకర్లు
కోటా ర్యాంక్ పేరు
జనరల్ (ఈడబ్ల్యూఎస్ ) 1 రామస్వామి సంతోష్‌రెడ్డి
ఎస్సీ 1 నందిగామ నిఖిల్
ఎస్టీ 1 బిజిలి ప్రచోతన్ వర్మ
ఓబీసీ (వికలాంగ) 1 గొర్లె క్రిష్ణచైతన్య
ఐఐటీ హైదరాబాద్ జోన్‌లోని టాప్ -5 ర్యాంకర్లు..
పేరు జాతీయర్యాంకు
రామస్వామి సంతోష్ రెడ్డి 4
పోలు లక్ష్మీ సాయిలోకేష్ రెడ్డి 5
మోదుల్ల హృషికేశ్ రెడ్డి 10
సవరం దివాకర్‌సాయి 11
ఆనంద్ నర్సింహన్ 17