కాజీపేట జీఆర్పీలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
కాజీపేట, డిసెంబర్ 31 : సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు వెళ్తున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరగ్గా, మంగళవారం కాజీపేట జీఆర్పీ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాజీపేట జీఆర్పీ సీఐ రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన పగాల ప్రశాంతి డిసెంబర్ 26న కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి దానాపూర్‌కు రైలులో బయలు దేరింది. రైలు వారణాసి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. సోమవారం దానాపూర్ నుంచి తిరిగివచ్చిన ప్రశాంతి మంగళవారం కాజీపేట జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారణాసికి కేసును బదిలీ చేసినట్టు సీఐ తెలిపారు.