హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : జహీరాబాద్‌లో కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని తేల్చింది. వివరాల్లోకి వెళ్లే.. 2003లో జహీరాబాద్‌లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చోరీ జరిగిందన్న సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లారు. పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకునే యత్నం చేస్తుంటే, ఆ ఇద్దరిలో.. మహమ్మద్ షఫీ అనే వ్యక్తి కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి రైఫిల్ లాకుని కాల్పులు జరపబోయాడు. వెంటనే ఏసీపీ శ్రీధర్‌రెడ్డి నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో షఫీ మరణించాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపారని కలెక్టర్ నిర్వహించిన మేజిస్టీరియల్ విచారణలో తేల్చారు.
నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని సీఐడీ నివేదిక ఇచ్చింది. దీనిని లతీఫ్ మహమ్మద్‌ఖాన్ మేజిస్ట్రేట్ కోర్టులో సవాల్ చేశాడు. విచారణ జరపాలని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని పోలీసు అధికారులు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులను 2019లో జిల్లా కోర్టు రద్దు చేసింది. దీనిపై ఖాన్ హైకోర్టులో సవాల్ చేశాడు. కలెక్టర్ నిర్వహించిన మేజిస్టీరియల్ విచారణ నివేదిక, సీఐడీ ఇచ్చిన తుది నివేదిక, వాంగ్మూలాల పరిశీలన తరువాత పోలీసులపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఇటీవల తీర్పు చెప్పారు. దీంతో ఏసీపీ పీ శ్రీధర్‌రెడ్డి, కానిస్టేబుల్ ఎన్ గోపాల్‌పై కేసులను రద్దు చేస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించారు.