అమరావతి : మార్కాపురం(Markapuram ) ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా, ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel Bus) రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయంతో పది మంది ప్రయాణికులు దిగిపోగా ఘటనలో మరో పది మంది సజీవదహనమయ్యారు. 26 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనా స్థలాన్ని మర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.