Betting Apps | బెట్టింగ్ యాప్స్ వలన ప్రస్తుతం ఉన్న యువత డబ్బులు పొగొట్టుకోవడమే కాకుండా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ (Promote) చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న బయ్యా సన్నీ యాదవ్ (Bye Sunny Yadav) అనే యూట్యూబర్‌పై కేసు నమోదు చేయమని సజ్జనార్ ఆదేశించగా.. అతడిపై సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సన్నీ యాదవ్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపాడు.
సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ అనే యూట్యూబర్‌పై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేశాం. ఇతడు సూర్యాపేట జిల్లా నుతనకల్లు మండలంకి చెందిన వ్యక్తి. ఇతడు తన సోషల్ మీడియా వేదికగా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. దీని వలన యువత తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందువలన అతడిపై నుతనకల్లు స్టేషన్లో కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతడిని త్వరలోనే పట్టుకుంటాం అంటూ డీఎస్పీ వెల్లడించాడు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వైజాగ్‌కు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్‌ని కూడా పోలీసులు బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేశారు.