హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ అథ్లెట్ మహేశ్వరి హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్ అండ్ రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీలో మైలు దూరాన్ని మహేశ్వరి 5 నిమిషాల 27.4 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ విభాగంలో సుచిత్ర (6:33.5సె.), సునీమా (6:56.9 సె.) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు బికాశ్ కారర్, చంద్రాదుత్ జోషి, రాజేశ్ కుమార్, శోభ పాల్గొన్నారు.