EPFO | న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ సొమ్మును తీసుకోవడం ఇక మీదట మరింత సులువు కానుంది. బ్యాంకు అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకున్నంత సులభంగా ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు రానున్నది. జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా బుధవారం ప్రకటించారు.
ఈ మేరకు తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లను చాలా వేగంగా పరిష్కరిస్తున్నామని, ఇప్పుడు మరింత సులువుగా మార్చే దిశగా పని చేస్తున్నట్టు చెప్పారు. క్లెయిమ్‌దారు, లబ్ధిదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ క్లెయిమ్ డబ్బులను పొందొచ్చని చెప్పారు. అయితే, ఈ కొత్త విధానం ఎలా పని చేస్తుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకున్నాక వారం, పది రోజుల్లో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి. మరి, ఈ కొత్త విధానం ఇందుకు ఏ రకంగా భిన్నంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.