బంజారాహిల్స్, డిసెంబర్ 8: యాదవుల కులదైవమైన మల్లన్నస్వామికి ప్రీతిపాత్రమైన ‘ఈర గోల’ను రాజకీయాల్లోకి లాగుతూ చిల్లర మాటలు మాట్లాడిన తీన్మార్ మల్లన్న వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నాయకుడు మానుక రాజుయాదవ్, ఒగ్గు పూజారి సాయి ఉప్పలయ్య, తదితరులు డిమాండ్ చేశారు. బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీలో మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను ఈర గోలతో కొడతామంటూ వ్యాఖ్యానించడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడిలో పూజలు చేసిన టీఆర్ఎస్ నాయకుడు రాజుయాదవ్, ఒగ్గు పూజారి ఉప్పలయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. యాదవులు పవిత్రంగా పూజించే ఈరగోలను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్న వెంటనే యాదవులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.