యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22: మెడలో స్వర్ణ, వజ్ర, ముత్యాల ఆభరణాలు.. చేతిలో సుమధుర గానామృతాన్ని పంచే పిల్లనగ్రోవి.. ఒంటిపై పట్టుపీతాంబర వస్ర్తాలు.. సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించిన దివ్య మంగళ రూపులో సకల జనావళిని సమ్మోహనం చేస్తూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శ్రీకృష్ణావతారం (మురళీకృష్ణుడు)లో దర్శనమివ్వగా భక్తులు భక్తితన్మయంతో ఉప్పొంగిపోయారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు ఆదివారం ఉదయం 10.30 గంటలకు పెండ్లికుమారుడిగా ముస్తాబైన స్వామివారు శ్రీకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. పంచసూక్తాలు, ఉపనిషత్తులను రుత్వికులు పఠిస్తుండగా ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారి సేవ ఊరేగింది.
తూర్పు మాడ వీధుల్లో ప్రత్యేక మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, శ్రీకృష్ణాలంకార సూక్తులను పఠించారు. రాత్రి ప్రధానాలయంలో నిత్యకైంకర్యాల అనంతరం స్వామివారిని పొన్న వాహన సేవపై అలంకరించి వేడుకను నిర్వహించారు. ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో ఈశ్యానదిశలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక మండపంలో భజనలు, నృత్యాలు భక్తులకు ఆకట్టుకున్నాయి.
సోమవారం శ్రీస్వామివారు ఉదయం10 గంటలకు గోవర్ధనగిరిధారిగా, రాత్రి 7 గంటలకు సింహవాహనంపై ఊరేగనున్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్భల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.